దివంగత కోడెల శివప్రసాద్‌ని వరుసగా అయిదుసార్లు గెలిపించిన స్థానం నరసారావుపేట..1983 నుంచి 1999 వరకు వరుసగా ఇక్కడ టిడిపి జెండా ఎగిరింది. ఆ తర్వాత నుంచి టిడిపి జెండా అక్కడ కనిపించడం లేదు. మళ్ళీ ఎగిరే అవకాశాలు కూడా లేవని తెలుస్తోంది. దీంతో కోడెల కోటపై ఆశలు వదిలేసుకున్నట్లేనా అనే పరిస్తితి. నరసారావుపేట అంటే ఒకప్పుడు టిడిపికి కంచుకోటే. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన కోడెల..1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా అయిదుసార్లు విజయం సాధించారు.
2004లో కాంగ్రెస్ వేవ్ లో ఓటమి పాలయ్యారు. ఇక 2008లో నియోజకవర్గాల పునర్విభజన చేయడంతో కొన్ని మండలాలు అటు ఇటు అయ్యాయి. దీంతో పేటలో రెడ్డి వర్గం హవా పెరిగింది. ఈ క్రమంలో 2009 ఎన్నికల్లో మళ్ళీ కోడెల ఓటమి పాలయ్యారు. ఇక 2014 ఎన్నికల్లో బిజేపితో పొత్తు ఉండటంతో నరసారావుపేట సీటుని ఆ పార్టీకి కేటాయించారు. కోడెల ఏమో సత్తెనపల్లికి వెళ్ళి పోటీ చేసి గెలిచారు.

కానీ నరసారావుపేటలో వైసీపీ గెలిచింది. ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి టిడిపి డైరక్ట్ గా బరిలో దిగింది. టిడిపి నుంచి చదలవాడ అరవింద్ బాబు పోటీ చేశారు. వైసీపీ నుంచి మళ్ళీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు. మళ్ళీ విజయం వైసీపీకే దక్కింది. అయితే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. కానీ ఆ వ్యతిరేకతని ఉపయోగించుకోవడంలో టిడిపి విఫలమవుతుంది.
దీంతో ఇటీవల సర్వేల్లో కూడా మళ్ళీ పేటలో టిడిపి గెలిచే అవకాశాలు లేవని, వైసీపీనే గెలుస్తుందని తేలింది. దీని బట్టి చూస్తే కోడెల కోట మళ్ళీ పోయేలా ఉంది.