వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన పొత్తు ఉంటుందా? అంటే ఇంకా క్లారిటీగా ఏమి చెప్పలేని పరిస్తితి ఉందని చెప్పాలి. ఎందుకంటే పొత్తుపై రోజుకో రకమైన ప్రచారం నడుస్తోంది. ఓ వైపు పొత్తు ఉంటుందనే ప్రచారం వస్తుంటే..మరోవైపు పొత్తు ఉండదనే ప్రచారం వస్తుంది. అయితే అధినేతల మనసులో ఏముందనేది రెండు పార్టీల కార్యకర్తలకు క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే చంద్రబాబు-పవన్ రెండుసార్లు కలిశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంటే ఒకరినొకరు సంఘీభావం తెలుపుకుంటున్నారు.

అధినేతలు పరంగా సఖ్యతగానే ఉన్నారు..కానీ కార్యకర్తల్లోనే కన్ఫ్యూజన్ ఉంది. ఓ వైపు ఏమో జనసేన శ్రేణుల నుంచి పలు డిమాండ్లు వస్తున్నాయి. పొత్తు ఉంటే పవన్‌కు సిఎం సీటు ఇవ్వాలని, సగం సీట్లు వరకు ఇవ్వాలనే డిమాండ్ వస్తుంది. ఇటు టిడిపి శ్రేణులు ఏమో సిఎం సీటు ఇచ్చే ప్రసక్తి లేదని, అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పేస్తున్నారు. ఇక సీట్ల పంపకాలపై రకరకాల ప్రచారం నడుస్తోంది.

కానీ దేనిపై క్లారిటీ లేదు. అయితే టిడిపి-జనసేన పొత్తు లేకుండా చేయడానికి వైసీపీ గట్టిగా కృషి చేస్తుంది. ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు పెరిగేలా చేయడం..కమ్మ-కాపు కులాల మధ్య చిచ్చు పెట్టడం లాంటి కార్యక్రమాలు చేస్తుంది. దీని వల్ల రెండు పార్టీల క్యాడర్ మధ్య విభేదాలు నడుస్తున్నాయి. కానీ ఇద్దరు అధినేతల మధ్య మాత్రం సఖ్యత ఉంది.

చంద్రబాబు-పవన్ పరోక్షంగా సహకరించుకుంటున్నారు. కలిసే వైసీపీని గద్దె దించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏదేమైనా అధినేతలే పొత్తు విషయం తేల్చాలి. వారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కార్యకర్తలు కట్టుబడి ఉంటారని చెప్పవచ్చు. కానీ పొత్తు విషయం ఎన్నికల సమయంలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
