ఎప్పుడైతే చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలిశారో అప్పటినుంచి వైసీపీ నేతలు వరుసపెట్టి ప్రెస్ మీట్లు పెట్టడం..బాబు-పవన్‌లపై విమర్శలు చేయడం చేస్తున్నారు. ఓ వైపు విమర్శలు చేస్తూనే మరో వైపు వారు కలిసొచ్చిన జగన్‌ని ఏం చేయలేరని మాట్లాడుతున్నారు. అంటే లోలోపల టీడీపీ-జనసేన పొత్తుపై కాస్త టెన్షన్ పడుతూనే..పైకి మాత్రం పొత్తు పెట్టుకుంటే మాకే మంచిదని, ఇంకా ఈజీగా గెలుస్తామని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు.కానీ ఏదొరకంగా టీడీపీ-జనసేన పొత్తుని దెబ్బతీయాలనే విధంగా వైసీపీ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.

వైసీపీ సోషల్ మీడియా కావచ్చు..సొంత, అనుకూల మీడియా ద్వారా కావచ్చు..టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య చిచ్చు పెట్టి..వారు మధ్య విభేదాలు పెరిగేలా స్కెచ్ వేస్తున్నారు. అసలు పొత్తు గురించి, సీట్ల గురించి టీడీపీ-జనసేనల మధ్య చర్చ లేదు. కానీ వైసీపీ ఈ చర్చ చేస్తుంది. జనసేనకు టీడీపీ ఇచ్చే సీట్లు ఇవే అని, చాలా తక్కువ సీట్లు ఇస్తారని, ఇంకా జనసేన శ్రేణులు టీడీపీ జెండాలు మోయాలని, వారికి బానిసలుగా ఉండాలంటే వివాదాలు క్రియేట్ చేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇటు మీడియా ద్వారా సీఎం సీటు విషయంపై చర్చ లేపుతున్నారు. చంద్రబాబు-పవన్‌లో ఎవరు సీఎం అవుతారని ప్రశ్నిస్తున్నారు. అసలు సీఎం పదవి గురించి, సీట్ల షేరింగ్ గురించి వైసీపీకి అనవసరమైన విషయం. కానీ కేవలం వారి మధ్య చిచ్చు పెట్టడానికి ఇలా కొత్త ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే జనసేనకు సీట్లు ఇస్తే అక్కడ టీడీపీ క్యాడర్ సహకరించరని వైసీపీ వాళ్లే ప్రచారం చేస్తున్నారు. అంటే ఎలాగైనా టీడీపీ-జనసేన పొత్తుని దెబ్బతీసే విధంగా వైసీపీ పావులు కదుపుతుంది. మరి వారి స్కెచ్ ఏ మేర వర్కౌట్ అవుతుందో చూడాలి.
