తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి..అదే పార్టీ ద్వారా బలం పెంచుకుని, రెండుసార్లు గెలిచి వైసీపీలోకి వెళ్ళి..అదే టిడిపిపై విమర్శలు చేస్తున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పరిస్తితులు రివర్స్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఆయనకు ఎదురులేదనే పరిస్తితి. పైగా అధికారంలో ఉన్నారు కదా..దీంతో ఆయనకు తిరుగులేకుండాపోయింది. కానీ రాష్ట్రంలో గాలి మారుతుంది..టిడిపి బలపడుతుంది.
ఇదే సమయంలో గన్నవరంలో సీన్ రివర్స్ అవుతుంది..వైసీపీలో ఉన్న వంశీకి అదే పార్టీ వాళ్ళు షాక్ ఇచ్చేలా ఉన్నారు. ఇప్పటికే వంశీకి యాంటీగా యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రారావులు ఉన్న విషయం తెలిసిందే..ఎట్టి పరిస్తితుల్లోనూ వంశీకి సహకరించేది లేదని అంటున్నారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన రావు సైతం వైసీపీకి దూరమవుతున్నారు. టీడీపీ వైపుకు వస్తున్నారు. గతంలో దాసరి టిడిపిలో పనిచేశారు. 2009లో గన్నవరం నుంచి గెలిచారు. కానీ 2014లో వంశీ కోసం దాసరిని చంద్రబాబు పక్కన పెట్టారు.
వంశీకి సీటు ఇచ్చి..దాసరికి విజయ డెయిరీ ఛైర్మన్ ఇచ్చారు. ఇక 2014లో వంశీ టిడిపి నుంచి గెలిచారు.

అయితే టిడిపిలో సీటు లేకపోవడంతో దాసరి తన సోదరుడుతో కలిసి 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్లారు. అప్పుడు గన్నవరంలో వైసీపీ నుంచి నిలబడ్డ యార్లగడ్డ వెంకట్రావు కోసం ప్రచారం చేశారు. ఇక యార్లగడ్డపై వంశీ స్వల్ప మెజారిటీతో గెలిచి..టిడిపిని వదిలి వైసీపీలోకి వచ్చారు. దీంతో దాసరి నిదానంగా పార్టీకి దూరం అవుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గుడివాడ, నూజివీడు పర్యటనలో చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ దాసరి ఫోటోలతో ఆయన అభిమానులు హనుమాన్ జంక్షన్ లో ఫ్లెక్షీలు కట్టారు.
అలాగే ఆయన స్వగ్రామంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలని నిర్వహించనున్నారు. దీనికి బాబుని ఆహ్వానించినట్లు తెలిసింది. దీంతో ఆయన టిడిపిలోకి వస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి గన్నవరంలో వంశీకి రివర్స్ అయ్యేలా ఉంది.