ఏపీలో టీడీపీ నాయకుల అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేకమంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులు అక్రమమా…సక్రమమా అనే సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలని ప్రశ్నిస్తే చాలు కేసులు పెట్టేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు, కార్యకర్తలు జైలుకు వెళ్లొచ్చారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఆయన బావమరిది చేస్తున్న అక్రమ మైనింగ్‌ని ప్రశ్నించిన టీడీపీ నేత దేవినేని ఉమాపైనే పోలీసులు రివర్స్‌లో కేసు పెట్టి జైలుకు తీసుకెళ్లారు.

ఇక ఉమాని రివర్స్‌లో అరెస్ట్ చేయడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. అటు అధినేత చంద్రబాబు దగ్గర నుంచి రాష్ట్రంలో ప్రతి ఒక్క టీడీపీ నేత ఉమాకు సపోర్ట్‌గా నిలబడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. అయితే ఇలా రియాక్ట్ అయ్యే నేతలు చివరి వరకు పోరాడాలని పలువురు టీడీపీ కార్యకర్తలు కోరుతున్నారు. ఎవరైనా టీడీపీ నేత గానీ, కార్యకర్తగానీ జైలుకు వెళ్ళితే వారికి అండగా ఉంటామని, అలాగే వైసీపీ ప్రభుత్వం అరాచకాలు చేస్తుందని, తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహ తిరిగి చెల్లిస్తామని మాట్లాడతారు.

అలాగే జైలు నుంచి బయటకొచ్చిన నేతని ఓదార్చే కార్యక్రమం చేస్తారు. అంతే తప్ప జైలుకు వెళ్ళిన నేత ఏ అంశం మీద పోరాటం చేశారు. దాని మీద మళ్ళీ ఎందుకు పోరాటం చేయకుండా ఆగిపోతారు? అని చెప్పి కొందరు తెలుగు తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏదో నాయకుడు జైలుకు వెళ్లినప్పుడు మాత్రం హడావిడి చేసి, తర్వాత దాన్ని పూర్తిగా వదిలేస్తున్నారని అంటున్నారు. ఈ తీరులో మార్పు రాకపోతే ప్రజల్లో ఇంకెప్పుడు గుర్తింపు వస్తుందన్న విమర్శలు పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.
Discussion about this post