టీడీపీలో ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. ఆ మాజీ మంత్రికి ఇక, టికెట్ ఛాన్స్ లేనట్టేనా? అనే చర్చ జరుగుతోంది. ఆయనే పొంగూరు నారాయణ. నెల్లూరు జిల్లా సిటీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి.. ఓడిపోయిన ఆయన తర్వాత.. ఇప్పటి వరకు కూడా తెరమీదకి రాలేదు. కనీసం.. చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నాయకులు అనరాని మాటలు అన్నారని.. చంద్రబాబు కన్నీరు కార్చినప్పుడు కానీ, పార్టీకి దేవాలయం వంటి టీడీపీ ఆఫీస్‌పై రాళ్ల వర్షం కురిసి.. చంద్రబాబు దీక్ష చేసినప్పుడు కానీ, ఆయన తొంగి చూడలేదు.

ఇక, నియోజకవర్గంలో ప్రజలకు ఎక్కడా ఆయన అందుబాటులో ఉండడం లేదు. కనీసం.. నెల్లూరులో గత ఏడాది వరదలు వచ్చి.. ప్రజలు కకావికలం అయినప్పుడు కూడా మాజీ మంత్రిగా ఆయన ఎక్కడా ఆయన ప్రజలను ఓదార్చింది కూడా లేదు. ఈ నేపథ్యంలో ఆయన వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఎలా ప్రయత్నిస్తారని.. ఒక వేళ ఆయన ప్రయత్నించినా.. చంద్రబాబు ఎలా ఇస్తారని.. అంటున్నారు తమ్ముళ్లు.

ఎందుకంటే.. చంద్రబాబు పదే పదే ఒక మాట చెబుతున్నారు. పార్టీలో నడుం వచ్చిన వారికే కుర్చీలు వేస్తామని.. అంటున్నారు. మరి ఇలా చూసుకుంటే.. నారాయణ ఈ మూడేళ్ల కాలంలో కనీసం ఇటు పుల్ల అటు పెట్టిన పాపాన పోలేద ని.. సీనియర్ల నుంచి ఆక్షేపణ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన టికెట్ అడిగే అవకాశం కోల్పోయారు. అదేసమయంలో.. ఆయన అడిగినా.. చంద్రబాబు ఎలా టికెట్ ఇస్తారని.. అంటున్నారు తమ్ముళ్లు.

“పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు.. ఆయన పదవిలోకి వచ్చారు. పార్టీ కోసం..మేం ఎంతో కష్టపడ్డాం. అయినా.. మమ్మల్ని పక్కన పెట్టి ఆయనకు టికెట్ ఇచ్చారు. పార్టీ అధికారంలో లేనప్పుడు.. ఆయన విద్యా వ్యాపారం చేసుకున్నారు. కానీ, మేం మాత్రం జెండాలే మోశాం. మరి ఇప్పుడు ఆయనకు టికెట్ ఎలా ఇస్తారు?“ అని నెల్లూరు టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుండడం గమనార్హం.

Discussion about this post