వైసీపీలో నడుస్తున్న అలజడులతో టీడీపీ సంతోష పడాలో..లేక దీని వెనుక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందని అనుమానించాలో తెలియని పరిస్తితి కనిపిస్తుంది. ఇప్పటివరకు ప్రతిపక్షంగా ఉంటూ టిడిపి..వైసీపీపై పోరాటం చేస్తూ వస్తుంది. దీని వల్ల వైసీపీ నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుంది..వైసీపీ ప్రజా వ్యతిరేక పాలన ప్రజలకు అర్ధమవుతుంది. ఇటు టిడిపి బలం సైతం పెరుగుతుంది.

ఇదే సమయంలో సొంత పార్టీ నేతలే వైసీపీపై విమర్శలు గుప్పించడంతో సీన్ మారిపోయింది. అందులోనూ వైసీపీకి అనుకూలమైన రెడ్డి వర్గం నేతలు రివర్స్ అయ్యారు. అది కూడా వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాల్లో వైసీపీకి దారుణమైన పరిస్తితులు ఎదురయ్యాయి. సొంత ప్రభుత్వంపైనే ఎమ్మెల్యేలు ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ముందు నుంచి ఆనం తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. అందుకే ఆయన్ని వైసీపీ సైడ్ చేసింది.


ఇదే క్రమంలో జగన్‌కు వీర విధేయుడుగా ఉండే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం రివర్స్ గేర్ వేయడం వైసీపీ శ్రేణులని షాక్‌కు గురి చేసింది. తమ పార్టీ అధిష్టానం..తన ఫోన్‌ని ట్యాప్ చేసిందని, ఇంత అనుమానం, అవమానం ఉన్న చోట తాను ఉండనని చెప్పేశారు. ఇలా కోటంరెడ్డి రివర్స్ కావడంతో యథావిధిగా వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి కోటంరెడ్డిపై ఫైర్ అయ్యారు.

ఇక ఆనం, కోటంరెడ్డి టీడీపీలో చేరడం ఖాయమైందని, వారికి సీట్లు కూడా ఫిక్స్ అని ప్రచారం నడుస్తోంది. అయితే బలమైన నాయకులు వస్తానని చెప్పిన టిడిపి క్యాడర్ హ్యాపీగా లేదు. దీని వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానిస్తున్నాయి. ఆనం విషయం పక్కన పెడితే కోటంరెడ్డి విషయంలోనే డౌట్ పడుతున్నారు. జగన్‌కు విధేయుడుగా ఉన్న కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్‌ని అడ్డం పెట్టుకుని వైసీపీని వీడుతున్నారా? అనేది డౌట్ గా ఉంది.

ఇదే డౌట్ టిడిపి సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ కూడా వ్యక్తం చేశారు. “వైసిపి కోవర్ట్ డ్రామా స్టార్ట్ అయినట్లు ఉంది… రాబోయే వ్యూహం సినిమా స్క్రిప్ట్ అనుకుంటా…! జర జాగ్రత్త తెలుగు తమ్ముళ్లు” అంటూ బుచ్చయ్య అలెర్ట్ ఇచ్చారు. ఇదంతా జగన్ డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు.
