టీడీపీలోకి ఆదినారాయణ రెడ్డి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారా? పొత్తుకు బీజేపీ రెడీగా లేకపోవడంతో ఆయన పార్టీ మారాలని చూస్తున్నారా? అంటే అవునేన కడప రాజకీయ వర్గాల నుంచి సమాధానం వస్తుంది. కడప జిల్లా రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న అది నారాయణ రెడ్డి..కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టి..జమ్మలమడుగు స్థానంలో మంచి విజయాలు సాదించారు. 2004, 2009 ఎన్నికల్లో సత్తా చాటారు.

2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు..ఆతర్వాత అధికారంలో ఉన్న టీడీపీలోకి జంప్ చేశారు. అలాగే మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి అధికారాన్ని కోల్పోయింది..వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో తనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి ఆది..టీడీపీని వదిలి బీజేపీలోకి వెళ్లారు. ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు.

కానీ ఏపీలో బీజేపీకి బలం లేదు..ఆ పార్టీకి ఒక్క సీటు గెలుచుకునే బలం లేదు. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే డిపాజిట్ రాదు. కాకపోతే టీడీపీతో పొత్తులో పోటీ చేస్తే నాలుగు సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ టీడీపీతో పొత్తుకు బీజేపీ ఒప్పుకోవడం లేదు. పైగా జనసేన కూడా టీడీపీతో పొత్తుకు రెడీ అంటుంది. దీంతో బీజేపీ సింగిల్ గా ఉంటే ఇబ్బందులు తప్పవని కొందరు నేతలు భావిస్తున్నారు.

ఇదే క్రమంలో ఆదినారాయణ కూడా టీడీపీలోకి వస్తారని ప్రచారం ఉంది. టీడీపీలోకి వస్తే ఆయనకు జమ్మలమడుగు సీటు దక్కడం కష్టం. ఎందుకంటే అక్కడ తన సోదరుడు కుమారుడు భూపేష్ రెడ్డి ఉన్నారు. దీంతో ఆయన ప్రొద్దుటూరు సీటు ట్రై చేస్తున్నారట. అక్కడ టీడీపీలో కూడా ఖాళీ లేదు. మరి ఆది టీడీపీలోకి వస్తారో లేదో చూడాలి.
