మొత్తానికి బీజేపీని వీడిన కన్నా లక్ష్మీనారాయణ..టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి రానున్నారు. తన అనుచరులతో కలిసి కన్నా..టీడీపీలోకి వస్తున్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి పెదకూరపాడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా పనిచేసిన కన్నా…రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలోకి చేరాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా బీజేపీ పెద్దలు సంప్రదించడంతో..కన్నా బీజేపీలో చేరారు.

అలాగే కన్నాకు ఏపీ బిజేపి అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. అధ్యక్షుడుగా ఉన్నంత కాలం తనదైన శైలిలో రాజకీయం చేసిన కన్నా..తర్వాత అధ్యక్ష పదవి పోయాక సైలెంట్ అయ్యారు. పైగా ఆయనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. అలాగే ఆయన వర్గాన్ని అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు తప్పించుకుంటూ వచ్చారు. కన్నా వర్గాన్ని పదవుల నుంచి తప్పించారు. పైగా సోము..పరోక్షంగా జగన్‌కు సపోర్ట్ గా ఉంటున్నారు. దీంతో కన్నా అసంతృప్తికి గురయ్యారు. చివరికి ఆయన పార్టీని వీడారు. సోము వీర్రాజు వైఖరి వల్లే పార్టీని వీడినట్లు చెప్పారు.

అలా బిజేపిని వీడిన కన్నా..టిడిపి లేదా జనసేన చేరతారని ప్రచారం వచ్చింది. కానీ అనూహ్యంగా ఆయన టిడిపిలో చేరడానికి రెడీ అయ్యారు. టిడిపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. 23వ తేదీన చంద్రబాబు సమక్షంలో టిడిపిలోకి వస్తున్నారు. ఇదే క్రమంలో కన్నాకు..గుంటూరు వెస్ట్ సీటు బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ సీటులో పలువురు టిడిపి నేతలు పోటీ పడుతున్నారు. కోవెలమూడి రవీంద్ర ఇంచార్జ్ గా ఉన్నారు.

అయితే గతంలో కన్నాకు గుంటూరులో గెలిచిన అనుభవం ఉంది..పైగా అది టిడిపి కంచుకోట. గత ఎన్నికల్లో టిడిపి నుంచి మద్దాలి గిరి గెలిచి వైసీపీలోకి వెళ్లారు. ఇప్పుడు వెస్ట్ సీటు కన్నాకు ఇస్తారని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచే కన్నా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.
