పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి టీడీపీ రాజకీయాలు బ్రష్టుపడుతోన్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలతో పాటు 2004 తర్వాత టీడీపీలోకి వచ్చి 15 ఏళ్లుగా కష్టపడుతోన్న నేతలు క్రమక్రమంగా పక్కకు వెళ్లిపోతున్నారు. 2019 ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్, వైసీపీల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే గంటా మురళీని 2019 ఎన్నికలకు ముందు జగన్ పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో ఆయన గతిలేక టీడీపీలోకి వచ్చారు. మురళీ టీడీపీ ఎంట్రీ కూడా ఆయన ఇష్టపడి రాలేదని.. రాజకీయంగా ఏదో ఒక జెండా భుజం మీద ఉండాలి కాబట్టే ఆయన పసుపు కండువా వేసుకున్నారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఆయన పార్టీలోకి వచ్చినా చింతలపూడిలో టీడీపీకి ఒరిగిందేమి లేదుకదా.. మరింత ప్రమాదంలో పడింది. పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనట్టుగా గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ 36 వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయింది. చివరకు మురళీ స్వగ్రామం పాతూరుతో పాటు ఆయన పంచాయతీలో వైసీపీ 1600 ఓట్ల బంపర్ మెజార్టీ సాధించింది.

గ్రూపు రాజకీయాలు ఫుల్.. సమన్వయం నిల్ :
గంటా మురళీ టీడీపీలోకి వచ్చాక పార్టీలో గ్రూపు రాజకీయాలు తీవ్రమయ్యాయి. 1983 నుంచి టీడీపీలో ఉన్న నేతలతో పాటు తర్వాత పార్టీలోకి వచ్చిన నేతలను పక్కన పెట్టేసి ఆయన ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళుతుండడంతో పార్టీ నియోజకవర్గంలో సర్వనాశనం అవుతోంది. 2019 ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన తన అనుచరులకే ఆయన కీలక పదవులు కట్టబెట్టించుకుంటున్నారు. 1983 నుంచి పార్టీలో ఉంటూ ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్న నేతలను ఈ రోజు పూర్తిగా అణిచివేస్తున్నారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన తన వర్గం నేత తూతా లక్ష్మణరావు ( మాజీ ఏఎంసీ చైర్మన్)తో పాటు కిలారు సత్యనారాయణకు మండల టీడీపీ అధ్యక్ష పదవి ఇప్పించుకున్నారు. ఇక్కడ మురళీ సీనియర్ నేతలను కలుపుకుని వెళ్లాలనుకుంటే తన వర్గం నేతను పోటీకి పెట్టేవారే కాదు.

చింతలపూడి నియోజకవర్గంతో పాటు మండలాల్లో జరుగుతోన్న పార్టీ కార్యక్రమాల్లో పార్టీ సీనియర్లు దూకుడుగా ఉంటున్నారు. మురళీ వర్గం నేతలకు పదవులు ఇచ్చినా వారి వెనక కేడర్ ఎవ్వరూ ఉండకపోవడంతో వారు నిర్వహిస్తోన్న కార్యక్రమాలు బోసిపోతున్నాయి. కేవలం ప్రచారం మాత్రమే వారు హడావిడి చేస్తున్నారే తప్పా.. వారి వెనక బలమైన వర్గం అంటూ లేకుండా పోయింది. పార్టీలో ఎవరికి వారే వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓ మాజీ ఎమ్మెల్యేగా, సీనియర్ నేతగా అందరిని కలుపుకుని పోవాల్సిన మురళీ వైఫల్యం ఈ విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఇప్పుడు కామవరపుకోట మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లోనూ తనతో పాటు పలు పార్టీలు మారి వచ్చిన నేతలకే అన్ని పదవులు కట్టబెడుతూ ఉండడంతో పాటు టీడీపీ పెత్తనం అప్పగిస్తున్నారు. దీంతో సగటు టీడీపీ అభిమాని ఆవేదనతో రగిలిపోతున్నారు. రేపటి ఎన్నికల వేళ ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ ఘోరంగా నష్టపోవడం ఖాయంగా ఉంది.

మురళీకి చింతలపూడి పగ్గాలా… హవ్వ…!
మరో విచిత్రం ఏంటంటే ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా ఉన్న చింతలపూడికి ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం ఇన్‌చార్జ్‌ను నియమించలేదు. ఓసీ వర్గానికి చెందిన మురళీకి తాత్కాలికంగా ఇన్‌చార్జ్ పగ్గాలు కట్టబెట్టి.. ఎన్నికలకు ముందు ఎవరో ఒకరికి పార్టీ బాధ్యతలు లేదా టిక్కెట్ ఇచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది పార్టీలో పెద్ద నవ్వులాటగా మారింది. సొంత పంచాయతీలో కాదు కదా.. స్వగ్రామంలో ఒక్క వార్డు కూడా గెలిపించుకోలేని మురళీకి ఇంత ప్రయార్టీయా ? అన్న ఆగ్రహావేశాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడింది. ఇక్కడ ఎస్సీ వర్గానికే చెందిన ఓ నేతకు ఇప్పుడే బాధ్యతలు ఇస్తే సదరు నేత జనాల్లోకి వెళ్లడంతో పాటు ఎన్నికల నాటికి తనతో పాటు పార్టీని బలోపేతం చేసే వీలుంటుంది. అలా కాకుండా మురళీకి పార్టీ పగ్గాలు ఇస్తే.. ఎన్నికల నాటికి చింతలపూడి టీడీపీ చీలికలు, పీలికలు అయిపోయేలా ఉంది. ఏదేమైనా చింతలపూడి టీడీపీలో పార్టీ పుట్టినప్పటి నుంచి జెండా పట్టుకున్న వారి బాధకు అంతే లేకుండా ఉంది.

Discussion about this post