ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై వ్యూహాత్మకంగా దెబ్బ వేయాలని భావించిన అధికార పార్టీవైసీపీ.. మంత్రి వర్గ కూర్పులో బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చింది. నిజానికి బీసీలను టీడీపీ ఎప్పుడో ఓన్ చేసుకుంది. అధికారంలో ఉన్నా.. లేకున్నా.. వారిని తమ ఆత్మబంధువులుగానే భావించింది. పదవులు ఇవ్వడంలోనూ.. గౌరవించడంలోనూ.. ఈ పార్టీ పునాదులు బలంగా ఉన్నా యి. ఎందుకంటే.. నాడు ఆత్మగౌరవ నినాదంతో పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ఏ సూత్రంతో అయితే.. బీసీలను అక్కున చేర్చుకున్నారో.. తర్వాత.. పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు కూడా అదే సూత్రాన్ని అనుసరించారు.
అంతకుమించి.. అన్న విధంగా బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. మంత్రి వర్గంలోనూ.. పార్టీలోనూ.. వీరికి బలమైన స్థానాలు కల్పించారు. నిర్ణయాత్మక రీతిలో వీరిని నడిపించారు. ఒకానొక దశలో.. చంద్రబాబు కన్నా.. బీసీ నేతలే ఎక్కువగా స్వేచ్ఛను పొందారనే.. వాదన పార్టీలో బలంగా వినిపించింది. ఇక, వచ్చే ఎన్నికల్లోనూ బీసీలను దన్నుగా చేసుకుని.. చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే.. చంద్రబాబు వ్యూహానికి అడ్డుకట్ట వేసేలా.. జగన్.. కొత్త పాచిక వేశారు. తన మంత్రివర్గంలో బీసీలకు 10 స్థానాలు కల్పించారు.
వీరిలోఇద్దరు మహిళా నేతలకు కూడా అవకాశం కల్పించారు. ఈ పరిణామంతో టీడీపీ బీసీ కూసాలు కదిలిపోయి.. తమకు అను కూలంగా పరిస్తితి మారిపోతుందని అనుకున్నారు. అయితే.. అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి.. అన్నవిధంగా జరిగిందనే కామెంట్లు వస్తున్నాయి. ఎందుకంటే.. గత మంత్రి వర్గంలో కూర్పును చూసిన తర్వాత.. ఇప్పుడు చేసిన మార్పును బీసీలు స్వాగతించడం లేదు. నిజానికి బీసీలపై ప్రేమ ఉంటే.. గత మంత్రి వర్గంలోనే ఇన్ని స్థానాలు ఇచ్చి ఉండాలి కదా? అనే ప్రశ్న వస్తోంది. అదేవిధంగా బీసీల కోసం.. చంద్రబాబు తీసుకువచ్చిన పథకాలను ఈ ప్రభుత్వం నిలిపివేసింది.
అందరికీ నవరత్నాలు ఇస్తున్నాం కదా..! అనే మాటతో బీసీలకు ప్రత్యేకంగా ఉన్న విద్య, విద్యోన్నతి, నూతన బీసీ హాస్టళ్ల నిర్మాణం వంటివాటిని.. వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇది బీసీలకు ఆగ్రహంగా ఉంది. పైగా.. బీసీల కోటాలో మంత్రి పదవి దక్కించుకున్న కొందరిపై ఆరోపణలు కూడా ఉన్నాయి. వారు ప్రజల మద్య ఉండరని.. ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారని.. చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ వేసిన పాచిక.. టీడీపీ విషయంలో సక్సెస్ కాలేదని.. పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ బీసీ జపం వల్ల టీడీపీకి జరిగే నష్టం వీసమెత్తు కూడా లేదని చెబుతున్నారు.
Discussion about this post