వైసీపీ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో రాజకీయ డ్రామాకు తెరలేపిన విషయం తెలిసిందే. పైకి మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమని చెప్పి మూడు రాజధానులు అని వైసీపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు గాని..అసలు టార్గెట్ మాత్రం మూడు ప్రాంతాల్లో రాజకీయ లబ్ది పొందడం. అయితే ఇంతవరకు మూడు రాజధానులని అమలు చేయలేదు గాని..రాజధానుల పేరుతో మాత్రం రాజకీయం చేస్తుంది.

అదేమంటే త్వరలోనే విశాఖకు రాజధాని తరలి వెళ్లిపోతుందని వైసీపీ మంత్రులు పదే పదే చెబుతూ వస్తున్నారు. అయితే ఇలా రాజధాని పేరుతో వైసీపీ వేసిన ఎత్తులు ఏ మాత్రం ఉపయోగ పడేలా లేవు. దీని వల్ల మూడు ప్రాంతాల్లో వైసీపీకి భారీ షాక్ తప్పేలా లేదు. ఇప్పటికే అమరావతిని దెబ్బకొట్టడం వల్ల ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీకి నష్టం ఎక్కువ జరిగేలా ఉంది. ఇటీవల వచ్చిన సర్వే ప్రకారం చూసుకుంటే..గుంటూరులో టిడిపి 8 సీట్లు గెలుచుకునేలా ఉంది. అటు వైసీపీకి 6 సీట్లు వస్తున్నాయి. 2 చోట్ల టఫ్ ఫైట్ ఉంది.కృష్ణాలో 16 సీట్లు ఉంటే టిడిపి 8, వైసీపీ 5, టఫ్ ఫైట్ 3 చోట్ల ఉంది. అంటే రెండు జిల్లాల్లో వైసీపీకి భారీ నష్టమే. అటు న్యాయ రాజధాని కర్నూలు అని అంటున్నారు. అక్కడ కూడా సీన్ రివర్స్..కర్నూలులో 14స్థానాలు ఉండగా వైసీపీ7, టిడిపి 7 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉంది.

ఇక అసలైనది విశాఖ..ఇక్కడ వైసీపీకి నష్టమే. మొత్తం 15 స్థానాలు ఉంటే వైసీపీ 5 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంది. టిడిపి 7 స్థానాల్లో గెలికే అవకాశాలు ఉన్నాయి. 3 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంది. అంటే మూడు రాజధానులతో వైసీపీనే నష్టపోయేలా ఉంది.