కరోనా దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగానే సినిమా ఇండస్ట్రీ అనేది కుదేలైపోయింది. అసలు సినిమా వాళ్లలో చిన్న చిన్న క్రాఫ్ట్‌ల వాళ్లు తినడానికి తిండి కూడా లేకుండా విలవిల్లాడిపోయారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరచుకుని పెద్ద పెద్ద సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ప్రజలు కూడా థియేటర్లకు వచ్చి సినిమాలు చూసేందుకు అలవాటు పడుతున్నారు. అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా.. ఇక మన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీ లో సినిమా పరిశ్రమతో పాటు థియేటర్లపై సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారు.

ఏదోలా సినిమా వాళ్లపై కక్ష కట్టి వాళ్లను ప్రతి విషయంలోనూ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. సినిమా వాళ్లలో చాలా మంది నోరు తెరచి ధైర్యంగా జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించ లేకపోతున్నారు. మొన్న పవన్ తాజాగా నాని మాత్రమే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక టిక్కెట్ రేట్లు ప్రభుత్వం తగ్గించి వేసింది. టిక్కెట్లు కూడా తమ పోర్టల్ ద్వారానే అమ్మాలి.. ఆ డబ్బు కూడా తాము ఇచ్చినప్పుడే తీసుకోవాలన్న రూల్స్ పెట్టేసింది.

చివరకు టిక్కెట్ రేటు పెంచుకోవచ్చని హైకోర్టు ద్వారా అనుమతులు తెచ్చుకున్నారు నిర్మాతలు.. కొందరు ఎగ్జిబిటర్లు. అయితే ఇప్పుడు థియేటర్లపై వరుస దాడులు చేస్తూ ఎక్కడికక్కడ అనుమతుల పేరుతో థియేటర్లు మూసి వేయిస్తున్నారు. కృష్ణా జిల్లాలో 50 సెంటర్లు ఉంటే నాని శ్యామ్‌సింగరాయ సినిమా కేవలం 6 సెంటర్లలో మాత్రమే రిలీజ్ అయ్యిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సగటును ఒక్కో జిల్లాలో 30 వరకు థియేటర్లు మూతపడ్డాయి. కొన్నింటిని థియేటర్ల యజమానులే మూసి వేస్తున్నారు. పలు చోట్ల ఎగ్జిబిటర్లు ప్రభుత్వ వేధింపులను తట్టుకోలేమని.. టిక్కెట్ రేట్లు గిట్టుబాటు కావని చెబుతూ.. మూసేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సగం ప్రభుత్వం మూయిస్తే.. మిగతా సగాన్ని ఎగ్జిబిటర్లే మూసేసుకుంటున్నారు. ఏదేమైనా ఏపీ సర్కార్ తీరు మారకపోతే ఏపీలో సినిమా ఇండస్ట్రీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. ఇక వాళ్లకు ఓటీటీలే శరణ్యం.

Discussion about this post