ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గం..రెడ్డి సామాజికవర్గ నేతల హవా ఎక్కువ ఉన్న స్థానం. సాధారణంగా తూర్పులో బీసీ, కాపు, ఎస్సీ వర్గాల హవా ఉంటుంది. రెడ్డి ప్రభావం తక్కువ. కానీ రెడ్డి వర్గం డామినేషన్ ఉండేది అనపర్తిలోనే. నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి అక్కడ రెడ్డి వర్గం నేతలే గెలుస్తూ వస్తున్నారు. 1983 నుంచి అక్కడ టిడిపి హవా నడుస్తోంది. టిడిపి నుంచి నల్లమిల్లి మూలారెడ్డి సత్తా చాటుతూ వచ్చారు.
అటు కాంగ్రెస్ లో తేతలి రామారెడ్డి గెలుస్తూ వచ్చారు. ఇలా ఇద్దరు రెడ్డి నేతల మధ్య వార్ జరుగుతూ వస్తుంది. ఇక 2014 నుంచి రామకృష్ణారెడ్డి, సూర్యనారాయణ రెడ్డిల మధ్య పోరు నడుస్తోంది. మూలారెడ్డి వారసుడుగా రామకృష్ణారెడ్డి టిడిపి నుంచి దూకుడుగా పనిచేస్తున్నారు. అటు రామారెడ్డి బంధువుగా సూర్యనారాయణ రెడ్డి వైసీపీలో పనిచేస్తున్నారు 2014లో టిడిపి నుంచి రామకృష్ణారెడ్డి గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో సూర్యనారాయణ రెడ్డి వైసీపీ నుంచి గెలిచారు.

దాదాపు 55 వేల ఓట్ల భారీ మెజారిటీతో సూర్యనారాయణ గెలిచారు. అలా భారీ మెజారిటీతో గెలిచిన ఆయన..అనపర్తిలో ఈ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి పెద్దగా లేదు..అనుకున్న మేర ప్రజల అంచనాలని చేరుకోలేకపోయారు. అదే సమయంలో టిడిపి నేత రామకృష్ణారెడ్డి ఇక్కడ నిదానంగా బలపడుతున్నారు. ప్రజల్లో ఉంటున్నారు. ఆ మధ్య అనపర్తికి చంద్రబాబు రావడం, ఆయన రోడ్ షోకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో పాదయాత్ర చేసి బాబు..అనపర్తిలో టిడిపికి కొత్త ఊపు తీసుకొచ్చారు.
అయితే ప్రస్తుతం అనపర్తిలో రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇక్కడ జనసేనకు కొన్ని ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో జనసేనకు 12 వేల ఓట్లు వరకు పడ్డాయి. ఇప్పుడు కాస్త బలం పెరిగింది. దీంతో జనసేన కాస్త నిర్ణయాత్మక శక్తిగా ఉంది. ఒకవేళ టిడిపితో జనసేన పొత్తు ఉంటే అనపర్తిలో పై చేయి సాధించవచ్చు.