తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి చాలా దారుణంగా మారిన విషయం తెలిసిందే. కేసిఆర్ రాజకీయానికి టిడిపి బలి అయింది. అలా టిడిపి దెబ్బతినడంతో ఆ పార్టీని నేతలు వరుసపెట్టి విడిచి వెళ్లారు. క్యాడర్ కూడా వెళ్లిపోయింది. ఇలాంటి పరిస్తితుల్లో ఉన్న పార్టీకి టిడిపి అధ్యక్షుడుగా కాసాని జ్ఞానేశ్వర్‌ని నియమించాక కాస్త పరిస్తితి మారుతూ వచ్చింది. ఆయన యాక్టివ్ గా పనిచేస్తూ..మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు.

మళ్ళీ పార్టీని ప్రక్షాళన చేసి..కొత్తగా పార్టీ కమిటీలని నియమిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలో భారీ సభ పెట్టడం, చంద్రబాబు రావడం జరిగాయి. అక్కడ నుంచి తెలంగాణలో టిడిపి శ్రేణులు కాస్త యాక్టివ్ అయ్యాయి. అదే సమయంలో గ్రామ స్థాయి నుంచి పార్టీని యాక్టివ్ చేయడానికి కాసాని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇంటింటికి తెలుగుదేశం పేరుతో కార్యక్రమం మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని 1329 డివిజన్లుగా, 661 మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లు, 540 గ్రామీణ రెవెన్యూ మండలాలు, 128 మున్సిపాలిటీలని డివిజన్లుగా విభజించి..కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించారు.

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కోఆర్డినేటర్లని నియమించారు. ఇందులో మహిళలు ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టనున్నారు. ఇందులో భాగంగా 26 తేదీన చంద్రబాబు చేతులు మీదుగా వారికి..పార్టీ సభ్యత్వాల బుక్..అభివృద్ధి బ్రౌచర్, కుంకుమ భరణి, గ్రామ, వార్డు వివరాలతో హ్యాండ్ బుక్ అందించనున్నారు. అవి పట్టుకుని కార్యకర్తలు ఇంటింటికి తిరిగి టిడిపి ఆవశ్యకతని ప్రజలకు వివరించనున్నారు.

గతంలో తెలంగాణలో టిడిపి చేసిన అభివృద్ధిని వివరించనున్నారు. అలాగే సభ్యత్వ కార్యక్రమం కూడా చేయనున్నారు. ఈ కాన్సెప్ట్ తో తెలంగాణలో పార్టీ బలం పెంచేలా పనిచేయనున్నారు.
