తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా కొనసాగుతూ వచ్చిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు సొంత నియోజకవర్గం తునిలో కష్టాలు కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. వరుసపెట్టి అక్కడ ఓడిపోవడం, ఇప్పటికీ బలపడకపోవడంతో ఆ సీటు విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకునేలా ఉన్నారు. యనమల ఫ్యామిలీకి కాకుండా మరొకరికి తుని సీటు ఇచ్చేలా కనిపిస్తున్నారు.

1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరు సార్లు యనమల తునిలో గెలిచారు. కానీ 2009లో ఓడిపోయారు. 2014లో తాను పోటీ చేయకుండా..తన సోదరుడు కృష్ణుడుకు సీటు ఇప్పించారు. కృష్ణుడు ఓడిపోయారు. అయితే టీడీపీ అధికారంలో ఉండటంతో యనమలకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి దక్కింది. ఇక 2019లో మరోసారి కృష్ణుడు పోటీ చేసి ఓడిపోయారు. కృష్ణుడుపై వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా రెండుసార్లు గెలిచారు. ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. దీంతో ఆయన ఇంకా బలం పెంచుకుంటున్నారు. ఇటు యనమల ఫ్యామిలీకి ప్రజల్లో బలం పెరగడం లేదు.

దీంతో బాబు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది. ఎలాగో యనమల పోటీ చేయడం లేదు..ఆయనకు ఎమ్మెల్సీ ఉంది. అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. అందుకే యనమలకు నచ్చజెప్పి..ఈ సారి తుని సీటులో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుకు గాని లేదా నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న శెట్టిబలిజ వర్గానికి చెందిన నేతకు గాని ఛాన్స్ ఇస్తారని తెలిసింది.

నియోజకవర్గంలో కాపులు, శెట్టిబలిజలు ఎక్కువ..దాడిశెట్టి ఎలాగో కాపు నేత. కాబట్టి ఆయనకు పోటీగా శెట్టిబలిజ వర్గానికి చెందిన నాయకుడుని నిలబెడితే అడ్వాంటేజ్ ఉంటుందని బాబు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ సారి యనమల ఫ్యామిలీని పక్కన పెట్టి వేరే నాయకుడుకు తుని సీటు ఇవ్వచ్చని తెలుస్తోంది. చూడాలి మరి తుని సీటుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.
