జనసేన పార్టీ బలం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కోనసీమ కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రతి చోట జనసేనకు బలం ఉంది. టిడిపి, వైసీపీలకు ధీటుగా జనసేన బలపడుతుంది. అయితే గత ఎన్నికల్లో టిడిపి, జనసేనల మధ్య భారీగా ఓట్లు చీలి వైసీపీకి లాభం జరిగింది. కానీ ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని చెప్పి టిడిపి, జనసేన కలుస్తున్న విషయం తెలిసిందే.
కోనసీమ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానం ఉంది. రామచంద్రాపురం, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, మండపేట స్థానాలు ఉన్నాయి. అమలాపురం పార్లమెంట్ ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ 5 సీట్లు గెలుచుకోగా, టిడిపి మండపేట, జనసేన రాజోలు సీటు గెలుచుకున్నాయి. ఇక వైసీపీ గెలిచిన 5 సీట్లు కేవలం టిడిపి, జనసేనల మధ్య ఓట్లు చీలడం వల్లే గెలిచింది. అంటే ఆయా స్థానాల్లో టిడిపిపై వైసీపీకి వచ్చిన మెజారిటీల కంటే జనసేనకు పడిన ఓట్లు ఎక్కువ.

అంటే రెండు పార్టీలు కలిస్తే కోనసీమలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలిచేది కాదు. అమలాపురం పార్లమెంట్ కూడా అంతే. టిడిపిపై వైసీపీ 40 వేల మెజారిటీతో గెలిస్తే..జనసేనకు 2 లక్షల 54 వేల ఓట్లు పడ్డాయి. అంటే రెండు పార్టీలు కలిస్తే అమలాపురం ఎంపీ స్థానం కూడా గెలిచేది కాదు. ఈ సారి రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. దీంతో వైసీపీకి పెద్ద రిస్క్. అయితే పొత్తులో ఎవరికి ఏ సీటు దక్కుతుందో క్లారిటీ లేదు. ఖచ్చితంగా మండపేట టిడిపికి, రాజోలు జనసేనకు దక్కుతుంది అందులో డౌట్ లేదు. మిగిలిన సీట్లలో క్లారిటీ లేదు. ఎవరికెన్ని సీట్లు దక్కుతాయో చూడాలి.