తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతల్లో తీవ్రమైన అసంతృప్తి కనిపిస్తోంది. పార్టీ కోసం ఎప్పటినుంచో పనిచేస్తున్న వారిని అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు వీరంతా కారు దిగి ఇతర పార్టీల కండువాలు ఒప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ లిస్టులో పలువురు కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పార్టీలో ఉన్న ఇద్దరు కీలక నేతలు కారు దిగేందుకు రెడీ అవుతున్నట్టు జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు నేతలు ఎవరో కాదు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి – కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు.

వీరిలో పొంగులేటి 2014 ఎన్నికల్లో ఖమ్మం నుంచి వైసీపీ తరఫున ఎంపీగా గెలిచారు. తర్వాత ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. జలగం వెంకటరావు 2014లో జిల్లాలోని ఏకైక టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 ముందస్తు ఎన్నికల్లో కొత్తగూడెంలో వెంకటరావు ఓడిపోయారు. ఆయనపై గెలిచిన వనమా వెంకటేశ్వరరావు టిఆర్ఎస్ లోకి వచ్చేయడంతో ఆ తర్వాత వెంకటరావుకు ప్రాధాన్యం తగ్గిపోయింది. అసలు ఆయనను పట్టించుకోవడం లేదు.

ఇక సిట్టింగ్ ఎంపీగా ఉండి కూడా గత ఎన్నికల్లో పొంగులేటికి సీటు రాలేదు. తెలుగుదేశం నుంచి వచ్చిన నామా నాగేశ్వరరావుకు ఎంపీ సీటు ఇవ్వడం.. ఆయన గెలవడం జరిగిపోయాయి. అప్పటినుంచి పొంగులేటికి రాజ్యసభ, ఎమ్మెల్సీ వస్తుందని ఎంతో ప్రచారం జరిగిన కేసీఆర్ మాత్రం ఆయనను పట్టించుకోవడం లేదు. తీవ్రమైన అసంతృప్తితో ఉన్న ఈ ఇద్దరు నేతలు తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అనుచరగణంతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ కూడా చేయించారని ప్రచారం జరుగుతోంది.

టీఆర్ఎస్ లో ఇమడలేక పోతున్న ఈ ఇద్దరు నేతలు… కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సరైన టైం కోసం ఎదురు చూస్తున్నారని జిల్లాలో జోరుగా టాక్ వినిపిస్తోంది. టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం ఈ ఇద్దరు నేతలను పార్టీలో చేర్చుకుంటే జిల్లా కాంగ్రెస్‌కు మాంచి ఊపు వస్తుందని భావిస్తున్నారట. వెంకట్రావు, పొంగులేటి టిఆర్ఎను వీడితే జిల్లాలో అధికార పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది.

Discussion about this post