అధికార వైసీపీలో అంతర్గత విభేదాలు తారస్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ పోరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కువగా కనబడుతుంది. ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి..వైసీపీకి షాక్ ఇచ్చి..పార్టీ నుంచి బయటకొచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం..సొంత పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అయితే మేకపాటిపై కాస్త ప్రజా వ్యతిరేకత ఉన్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ వైసీపీకి నెగిటివ్ కనిపిస్తుంది. ఇదే తరుణంలో ఉదయగిరి వైసీపీ పరిశీలకుడుగా పనిచేసిన కొడవలూరి ధనుంజయరెడ్డితో మేకపాటికి విభేదాలు నడిచాయి. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా కొడవలూరి తనకు నచ్చినట్లు పనిచేస్తున్నారని మేకపాటి ఈ మధ్య ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేకు ఇబ్బంది లేకుండా వారధిగా ఉండాల్సిన పరిశీలకుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు.

దీంతో వైసీపీ అధిష్ఠానం నియోజకవర్గ పరిశీలకుడిగా కొడవలూరి ధనుంజయరెడ్డిని తొలగించి మెట్టుకూరు ధనుంజయరెడ్డిని కొత్త పరిశీలకుడుగా నియమించారు. అయినా సరే ఉదయగిరిలో వైసీపీకి అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు. ఇక్కడ చాలా వరకు వైసీపీకి నెగిటివ్ కనిపిస్తుంది..అదే సమయంలో టిడిపి నేతలు కలిసికట్టుగా పనిచేస్తే ఉదయగిరిలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఉదయగిరిలో వైసీపీకి రిస్క్ పెరుగుతుందనే చెప్పాలి.
