మరో రెండు సంవత్సరాల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని.. సీఎం జగన్ చెబుతున్నారు. ఇదే విషయంపై నేతలకు ఆయన హితోపదేశం చేస్తున్నా రు. సరే.. నేతల సంగతి ఎలా.. ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపించే మూడు వ్యవస్థలు ఇప్పుడు జగన్‌కు ఇబ్బందిగా మారాయని అంటున్నారు పరిశీలకులు. ఒకటి పంచాయతీ వ్యవస్థ. రెండు మండల వ్యవస్థ. మూడు జిల్లా పరిషత్‌లు. దేశంలో దాదాపు అన్నీ కూడా వైసీపీ ఏలుబడిలోనే ఉన్నాయి.
గ్రామాల్లోనూ.. మండలాల్లోనూ.. పరిషత్‌లోలోనూ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించు కుంది. పైగా అన్ని పదవులను దాదాపు మహిళలకే అప్పగించారు. 50 శాతం మంది బాధ్యులుగా మహిళలే ఉన్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించే బాధ్యత వీరిపైనే ఎక్కువగా ఉంది. ఈనేపథ్యంలో వీరు తర్జన భర్జన పడుతున్నారు. ఎందుకంటే.. పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర సర్కారు వాడుకుంటోంది. అదేసమయంలో మండల పరిషత్‌లను పట్టించుకోవడం లేదు. ఇక, జిల్లా పరిషత్‌లలో పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.
దీంతో వీరంతా ఇప్పుడు.. ప్రజల్లోకి ఏమొహం పెట్టుకువెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. నిధులు లేవు. గ్రామాల్లో అభివృద్ధి లేదు. జిల్లాల్లో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. కేవలం ఉత్సవ విగ్రహాల్లో మేం ఉన్నాం! అని మెజారిటీ నేతలు ఇదే మాట అంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేయమని ఎలా అడుగుతామని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుంటే.. కార్పొరేషన్ల పరిస్థితి కూడా ఇలానే ఉంది. కులానికి ఒక కార్పొరేషన్ అంటూ.. రాష్టంలో 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇక్కడ కూడా మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. పదవులు అయితే.. ఇచ్చారు కానీ.. పనులు మాత్రం కల్పించలేదు.
దీంతో కార్పొరేషన్లలో పదవులు పొందిన వారు.. గోళ్లు గిల్లుకుంటున్నారు. తమ వద్దకు వచ్చే ఆయా సామా జిక వర్గాల ప్రజలకు సమాధానం చెప్పలేక.. పనులు చేయలేక తల్లడిల్లుతున్నారు. అదేసమయంలో అధికారులకు.. చైర్మన్‌లకు మధ్య ఆధిపత్య ధోరణి పెరిగిపోయింది. దీంతో కార్పొరేషన్ల ఏర్పాటు వెనుక.. జగన్ ఉద్దేశం మంచిదే అయినా.. అది సాకారం అవడం లేదని.. కార్పొరేషన్ల బాధ్యులు చెబుతున్నారు. మరి పరిస్థితి ఇలానే ఉంటే.. వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా వైసీపీని గట్టెక్కిస్తారని.. ప్రజలకు ఏం చెబుతారని.. వారు ప్రశ్నిస్తున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.
Discussion about this post