వచ్చే ఎన్నికల్లో వంగవీటి రాధా ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారు? ఆయన టిడిపిలోనే కొనసాగుతారా? లేదా బయటకొస్తారా? అని చెప్పి మీడియాకే కాదు..ఆయన అనుచరులు, టిడిపి శ్రేణులు, కాపు వర్గం..ఆఖరికి ప్రత్యర్ధి పార్టీ వైసీపీ కూడా ఎదురుచూస్తుంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో కాపు వర్గాన్ని ప్రభావితం చేయగల శక్తివంతమైన నేతల్లో వంగవీటి కూడా ఒకరు. రంగా వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన రాధా..రాజకీయంగా పెద్ద సక్సెస్ మాత్రం చూడలేదు.
మొదట్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2004లో విజయవాడ ఈస్ట్ లో గెలిచారు. తర్వాత నుంచి పరాజయాలు పలకరించాయి. 2009లో ప్రజారాజ్యం నుంచి విజయవాడ సెంట్రల్ లో, 2014లో వైసీపీ నుంచి ఈస్ట్ లో పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు టిడిపిలోకి వచ్చారు. కానీ పోటీ చేయలేదు. టిడిపి అభ్యర్ధుల కోసం ప్రచారం చేశారు.
టిడిపి ఓడిపోయాక ఆయన కాస్త రాజకీయాలకు దూరమయ్యారు. తన తండ్రి రంగా విగ్రహావిష్కరణల్లోనే పాల్గొంటున్నారు. అప్పుడప్పుడు ఆయన టిడిపిలో కనిపిస్తున్నారు. ఒకసారి చంద్రబాబు నేరుగా రాధా ఇంటికెళ్లారు. అప్పుడు రాధాకు ప్రాణహాని ఉందనే ప్రచారం నేపథ్యంలో ఆయన ఇంటికెళ్లారు.
ఇక రాధా అమరావతి రైతుల పాదయాత్రలో..తర్వాత లోకేష్ పాదయాత్ర మొదట్లో పాల్గొన్నారు. తర్వాత కనిపించలేదు. దీంతో మీడియాలో ఆయన జనసేనలోకి వెళుతున్నారని ప్రచారం వచ్చింది. కానీ మళ్ళీ విజయవాడలో లోకేశ్ పాదయాత్ర జరిగే పాల్గొన్నారు. దీంతో ఆయన టిడిపిలోనే ఉంటారని తేలింది.
కానీ ఎక్కడ పోటీ చేస్తారు? అనేది పెద్ద ప్రశ్న..విజయవాడ సెంట్రల్ లో బోండా ఉమా, ఈస్ట్ లో గద్దె రామ్మోహన్ ఉన్నారు. ఆ సీట్లు డౌటే. వెస్ట్ లోకి వెళ్లరు. పోనీ మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తారా? అది క్లారిటీ లేదు. కానీ తాజాగా ఆయన కాకినాడ ఎంపీగా పోటీచేస్తారని ప్రచారం జరుగుతుంది. కాకినాడలో కాపు వర్గం హవా ఎక్కువ.
గత ఎన్నికల్లో ఇక్కడ టిడిపి నుంచి చలమలశెట్టి సునీల్ పోటీ చేస్తే.ఆయన తరుపున రాధా ప్రచారం చేశారు. కానీ 25 వేల ఓట్లతో సునీల్ ఓడిపోయారు. తర్వాత వైసీపీలోకి వెళ్లారు. దీంతో ఇప్పుడు రాధాని కాకినాడ ఎంపీగా పోటీ చేయించవచ్చు అనే ప్రచారం కూడా ఉంది. చూడాలి మరి రాధా ఎక్కడ పోటీలో ఉంటారో.
ReplyReply allForward |