జాతీయ ఎస్సీ కమిషన్, ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఎస్సీ ఎస్టీ చట్టాలను గన్నవరం సీఐ కనకారావు దుర్వినియోగం చేశారని లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ చట్టాలతో టీడీపీని, నేతలను ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈనెల 20న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దొంతు చిన్నాపై దాడిచేశారని, దాడి విషయం తెలిసి టీడీపీ నేత చిన్నాను పరామర్శించేందుకు గన్నవరం వెళ్లిన పట్టాభిరామ్ పై దాడిచేసి తప్పుడు కేసుపెట్టారని మండిపడ్డారు. సీఐ కనకారావు ‘బీసీ సీ’ కమ్యూనిటీ వ్యక్తి అయినప్పటికీ.. ఉద్దేశపూర్వకంగా ఎస్సీ ఎస్టీ(ప్రో) యాక్ట్ కింద పట్టాభిపై కేసు పెట్టారని ఆయన తప్పుబట్టారు. కనకారావు అధికార దుర్వినియోగానికి పాల్పడి.. తప్పుడు కేసులు నమోదు చేయడంపై సమగ్ర విచారణ జరపాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.


సీఐ కనకారావు తోపాటు ఎమ్మెల్యే వంశీ ముఖ్య అనుచరుడు గొన్నూరు సీమయ్య ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పట్టాభితోసహా పలువురు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోసహా హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 143, 147, 341, 333, 307 కింద కేసులు నమోదు చేశారు. పట్టాభితోపాటు పది మందిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. గన్నవరంలో జరిగిన ఘటనలకు సంబంధించి నమోదు చేసిన మూడు కేసుల్లో 13 మందిని పోలీసులు నిందితులుగా చూపించారు. వారిలో పట్టాభితోపాటు పది మందిని గన్నవరంలోని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
