రాష్ట్రంలో ఎక్కడకక్కడ అధికార వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య గొడవలు ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల పరోక్షంగా గొడవలు జరుగుతుంటే..కొన్ని చోట్ల నేతలు వీధికెక్కి తిట్టుకుంటున్నారు. తాజాగా విజయవాడలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఒకరినొకరు దారుణంగా తిట్టుకున్నారు.

ఓ వైసీపీ నేత పుట్టిన రోజు వేడుకల్లో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌లు ఒకరినొకరు తీర్వంగా దూషించుకున్నారు. తన నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత ఆకుల శ్రీనివాస్‌ని సామినేని..జగన్ వద్దకు తీసుకెళ్ళడంపై వెల్లంపల్లి ఫైర్ అయ్యారు. నువ్వు ఏమైనా పోటు గాడివా అంటూ సామినేనిపై వెల్లంపల్లి విరుచుకుపడ్డారు. పార్టీలో సీనియర్‌ని అని, నీకు మాదిరిగా పార్టీలు మారిన ఊసరవెల్లిని కాదని, విజయవాడ ఏమైనా నీ సోత్తా అంటూ సామినేని కూడా ఫైర్ అయ్యారు. ఇలా ఇద్దరు నేతల మధ్య రచ్చ జరిగింది.

ఇదే సమయంలో సామినేనిని ఉద్దేశించి వెల్లంపల్లి కాపు రౌడీలు అని అన్నారని, అందుకు క్షమాపణ చెప్పాలని కాపునాడు డిమాండ్ చేసింది. అటు వెల్లంపల్లి సొంత సామాజికవర్గం వైశ్యులు కూడా సామినేనిపై గుర్రుగా ఉన్నారు. ట్విస్ట్ ఏంటంటే..సామినేని ప్రాతినిధ్యం వహించే జగ్గయ్యపేటలో వైశ్య ఓటింగ్ ఎక్కువ. ఇటు వెల్లంపల్లి ప్రాతినిధ్యం వహించే విజయవాడ వెస్ట్ లో కాపు ఓటింగ్ ఎక్కువ.

ఇప్పుడు వీరి మధ్య గొడవ..రెండు కులాల మధ్య గ్యాప్ వచ్చేలా ఉంది. దీని వల్ల జగ్గయ్యపేటలో వైశ్యులు సామినేనికి సపోర్ట్ చేసేలా లేరు. ఇటు వెస్ట్ లో వెల్లంపల్లికి కాపులు సపోర్ట్ చేసేలా లేరు. దీని వల్ల ఫైనల్ గా వైసీపీకి డ్యామేజ్ అయ్యేలా ఉంది.

