వరుసగా మూడుసార్లు ప్రతిపక్షంలోనే ఉన్నా ఈ సారి ప్రభుత్వంలోకి వస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కొడాలి నాని గత ఎన్నికల ముందు గుడివాడ ప్రజలకు హామీ ఇచ్చారు..2009 నుంచి కొడాలి ఇలాంటి హామీతోనే ముందుకొస్తున్నారు. పైగా ప్రజలు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటున్నారు కదా..అందుకే ఏం చేయలేకపోతున్నారని అనుకుంటున్నారు. ఎందుకంటే 2004లో కొడాలి టిడిపి నుంచి గెలిచినప్పుడు టిడిపి ప్రతిపక్షమే. 2009లో అదే పరిస్తితి.

కొడాలి తర్వాత వైసీపీలోకి వెళ్లారు..2014లో గెలిచారు. అప్పుడు వైసీపీ ప్రతిపక్షమే. దీంతో కొడాలి పెద్దగా ఏం చేయలేదు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మళ్ళీ గెలిచారు. అటు వైసీపీ అధికారంలోకి వచ్చింది..అలాగే కొడాలి మంత్రి కూడా అయ్యారు. మరి గుడివాడ ఏమైనా అభివృద్ధి అయిందా? అంటే అబ్బే లేదనే చెప్పాలి. గుడివాడలో పెద్దగా మార్పు లేదు. పైగా ఎక్కడకక్కడ గుంతల రోడ్లే ఉన్నాయి. ఇక తర్వాత మంత్రి పదవి పోయింది. ఎమ్మెల్యేగా ఉంటూ గుడివాడకు చేసింది ఏమి కనబడటం లేదు.

పైగా ఈయన..చంద్రబాబుని ఏ స్థాయిలో తిడతారో తెలిసిందే. అలా బూతులు తిట్టడమే కొడాలికి ఇబ్బందిగా మారింది. ఇటు గడపగడపకు తిరగడంలో కూడా నాని ఫెయిల్ అవుతున్నారని స్వయంగా జగన్ చెప్పారు. అసలు కనీసం రోజుకు రెండు గంటలు కూడా గడపగడపకు తిరగడం లేదట.

ఇక తన తప్పుని కొడాలి కూడా ఒప్పుకున్నారు. తన లాంటి బద్ధకస్తులకు జగన్ క్లాస్ పీకారని, ఇకనైనా గడపగడపకు తిరగాలని సూచించారని చెప్పుకొచ్చారు. అయితే ఇలా ఓపెన్ గా కొడాలి ఏం చేయట్లేదని చెప్పేస్తున్నారు..అయినా సరే ఆయన ధీమా వేరుగా ఉంది. ఎలా ఉన్నా సరే గుడివాడ ప్రజలు గెలిపిస్తారని, తనకు తిరుగులేదని భావిస్తున్నారు. మరి ఏం చేయకపోయిన కూడా గుడివాడ ప్రజలు ఈ సారి నానిని గెలిపిస్తారో లేదో చూడాలి.
