జగన్ ప్రభుత్వంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు. గత రెండేళ్లుగా జగన్ ప్రభుత్వంపై పోరాడుతున్న రఘురామ…ఇప్పుడు మరింత దూకుడు పెంచారు. వైసీపీని ఇరుకున పెట్టడానికి తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమయ్యారు. మళ్ళీ ఎంపీగా పోటీ చేసి వైసీపీపై గెలవాలని చూస్తున్నారు.

అదే సమయంలో వైసీపీ సైతం..రఘురామకు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే రఘురామని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. సిఐడి చీఫ్ సునీల్ కుమార్‌ని దూషించారని చెప్పి రఘురామపై కేసు నమోదైంది. అంతకముందే రఘురామని రాజద్రోహం కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరొకసారి ఆయనని విచారణకు రావాలని చెప్పి పోలీసులు పిలిచారు. ఈ పరిణామాల నేపథ్యంలో తనని చంపడానికి సిఐడి చీఫ్ చూస్తున్నారని, దీనికి జగన్ సహకారం ఉందని చెప్పి రఘురామ, ప్రధాని మోదీకి, కేంద్ర హోమ్ శాఖకు ఫిర్యాదు కూడా చేశారు.

అయితే రఘురామ ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గట్టిగానే స్పందించారు. గుడ్డ కాల్చి మొహాన వేస్తే ఆ మసిని వారే తుడుచుకుంటారులే రఘురామ అనుకుంటున్నాడని విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. ఢిల్లీలో కూర్చొని తనని చంపేస్తారని ఏడుపు మొదలెట్టాడని, ఇదంతా చీప్ పబ్లిసిటీ స్టంట్ అన్నట్లు విజయసాయి మాట్లాడారు. దీనికి రఘురామ కూడా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

‘విశాఖపట్నం నుంచి గెంటేసి, అండమాన్ నికోబార్‌కు పంపించినా మళ్లీ వచ్చాడని, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చేతిలో తన్నులు తిన్నా సిగ్గులేదు వీడికి అని ఫైర్ అయిన రఘురామ..రేపో మాపో వీడు కూడా తన దారే పడతాడని’ విమర్శించారు. అంటే వైసీపీ నుంచి రఘురామని ఎలాగైతే బయటకు పంపించేశారో..అలాగే విజయసాయిని కూడా పంపించేస్తారనే కోణంలో మాట్లాడారు. వాస్తవానికి అలాంటి పరిస్తితి ఉండకపోవచ్చు. కానీ ఈ మధ్య వైసీపీలో విజయసాయికి కాస్త ప్రాధాన్యత మాత్రం తగ్గినట్లే కనిపిస్తోంది. మరి చూడాలి వైసీపీలో విజయసాయిరెడ్డి పరిస్తితి ఏం అవుతుందో?

Discussion about this post