గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో కూడా టీడీపీ గెలిచిన సీట్లలో విజయవాడ ఎంపీ సీటు కూడా ఒకటి. పార్టీ బలంతో పాటు సొంత ఇమేజ్ తో కేశినేని నాని ఎంపీగా గెలిచారు. అయితే టీడీపీలో ఉండే కొన్ని అంతర్గత విభేదాలతో నెక్స్ట్ కేశినేని విజయవాడ ఎంపీగా బరిలో దిగరనే ప్రచారం వస్తుంది. ఇప్పటికే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారని, కాబట్టి ఈ సీటుపై కేశినేని సోదరుడు కేశినేని చిన్ని ఫోకస్ పెట్టారు. అందుకే విజయవాడలో యాక్టివ్ గా రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.


అటు కేశినేని నాని వ్యతిరేక వర్గంగా ఉన్న నేతలు చిన్నికి సపోర్ట్ చేస్తున్నారు. అయితే మొన్నటివరకు కేశినేని నాని విజయవాడ సీటుపై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఆయన దూకుడుగా పనిచేస్తున్నారు. తాను పోటీ చేయనని చెప్పలేదని, చంద్రబాబు సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా ప్రజలు గెలిపించుకుంటారని చెప్పుకొచ్చారు. అటు కేశినేని చిన్ని కూడా చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, నానికి సీటు ఇస్తే సహకరిస్తానని అంటున్నారు. నాని మాత్రం తన తమ్ముడుకు సీటు ఇస్తే సహకరించనని చెబుతున్నారు.


ఇలా అన్నదమ్ముల మధ్య ఎంపీ సీటు చిచ్చు రేగింది. మరి ఈ సీటు విషయంలో బాబు నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మళ్ళీ నానికే సీటు ఇస్తారా? లేక చిన్నిని తీసుకొచ్చి పెడతారా అనేది క్లారిటీ లేదు. అయితే కేశినేని నానికి సీటు ఇస్తేనే విజయవాడలో టీడీపీ మళ్ళీ గెలవడం గ్యారెంటీ అని కొందరు టీడీపీ శ్రేణులు అంటున్నాయి. అటు చిన్నికి సపోర్ట్ చేసేవారు ఉన్నారు. చూడాలి మరి చివరికి విజయవాడ ఎంపీ సీటు ఎవరికి దక్కుతుందో.

