ఏపీలో రాజకీయాలు ఏ మాత్రం అర్ధం కాకుండా చేసే నాయకుడు ఎవరంటే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అని చెప్పవచ్చు. ఆయన ఎప్పుడు ఎలాంటి రాజకీయం చేస్తారో అర్ధం కాదు. అలాగే ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారు..ఏ పార్టీలోకి వెళ్తారనేది క్లారిటీ ఉండదు. ఇంతవరకు ఆయన పోటీ చేసిన చోట మళ్ళీ పోటీ చేయలేదు. 1999 ఎన్నికల్లో టిడిపి నుంచి అనకాపల్లి ఎంపీగా గెలిచారు. 2004లో టిడిపి నుంచి చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారు.

2009లో ప్రజారాజ్యం నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టిడిపి నుంచి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో టిడిపి నుంచి విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలిచారు. టిడిపి అధికారంలోకి రాకపోవడంతో పార్టీ నుంచి జంప్ అవ్వాలని చూశారు..మరి వైసీపీలో కొన్ని అడ్డంకులు ఎదురుకావడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో గంటా టిడిపిలో యాక్టివ్ అయ్యారు. పైగా టిడిపి-జనసేన పొత్తు ఉండవచ్చు అనే ప్రచారం నేపథ్యంలో ఆయన టిడిపిలోనే ఉండిపోయారు.

మళ్ళీ యాక్టివ్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతకాలం తాను గెలిచిన విశాఖ నార్త్ నియోజకవర్గం మొహం చూడని గంటా ఇటీవల అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో ఆయన మళ్ళీ నార్త్ లో పోటీ చేస్తారా? అనే ప్రచారం వస్తుంది. కానీ గంటా సెంటిమెంట్ ప్రకారం..ఎప్పటికప్పుడు నియోజకవర్గాలు మార్చేస్తారు. ఈసారి ఆయన భీమిలిలో పోటీ చేస్తారనే ప్రచారం ఉంది.

కానీ ఇంతవరకు గంటా స్థానంపై క్లారిటీ రాలేదు. మళ్ళీ ఆయన విశాఖ నార్త్లోనే పోటీ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు. కాకపోతే జనసేనతో పొత్తు ఉంటేనే నార్త్ లో గెలవగలరు..లేదంటే కష్టమే. చూడాలి మరి ఈ సారి గంటా సీటు ఎక్కడో.
