జగన్ అధికారంలోకి రాగానే తీసుకొచ్చిన కొత్త వ్యవస్థ…వాలంటీర్ వ్యవస్థ. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ని నియమించారు. ఆ 50 ఇళ్ల బాగోగులు వారే చూసుకుంటారని, వారి సమస్యలని పరిష్కరిస్తారని, పథకాలు సక్రమంగా అందేలా చేస్తారని చెప్పుకొచ్చారు. అవును ఇదంతా వినడానికి బాగానే ఉంది..కానీ అది అమల్లోకి వచ్చిందా? అంటే ముందు వాలంటీర్లు అంటే వైసీపీ కార్యకర్తలని పెట్టారు. ఆ విషయం స్వయంగా వైసీపీ నేతలే చెప్పారు. వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లు అయ్యారు అనమాట.

ఇక వారు చెప్పిన వారికే పథకాలు..నచ్చిన వారికే పనులు చేయడం జరుగుతూ వస్తున్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఎదురు తిరిగితే పథకాలు కట్..వైసీపీకి ఓటు వేయకపోతే అన్నీ బంద్ అనే విధంగా వాలంటీర్లు బెదిరింపుల పర్వానికి దిగారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు నిజమో కాదో ప్రజలకు తెలియాలి. ఆ విషయం పక్కన పెడితే..మధ్యలో తమ జీతాలు పెంచాలని 5 వేలు చాలవని వాలంటీర్లు ఆందోళన చేశారు. దీనికి జగన్ చెక్ పెడుతూ వాలంటీర్లు అంటే ఉద్యోగాలు కావని, ప్రజలకు సేవ చేసేవారు అని చెప్పుకొచ్చారు.

దీంతో వాలంటీర్ల ఆందోళనలు ఆగాయి..అయినా వారు వైసీపీ కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. ఇప్పుడు వారి చేతుల్లోనే వైసీపీ ఎమ్మెల్యేల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. కాకపోతే వారిపైనే వైసీపీ నేతలకు డౌట్ వచ్చినట్లు ఉంది. తమ వాళ్ళు అనే చెబుతున్నారు కానీ వారి ఓట్లు పూర్తిగా పడతాయా? లేదా? అనేది డౌట్.

అందుకే టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లని తప్పిస్తారని వైసీపీ నేతలు స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు..అలాగే మళ్ళీ అధికారంలోకి వస్తే వారి జీతాలు పెంచుతామని ప్రకటనలు చేస్తున్నారు. దీని బట్టి చూస్తే వాలంటీర్లని సైతం ఆకట్టుకోవడానికి వైసీపీ నేతలు కష్టపడుతున్నారని చెప్పవచ్చు.
