ఉరవకొండ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న నియోజకవర్గం. ఇదొక వెరైటీ స్థానం. రాష్ట్రంలో కొన్ని స్థానాల్లో గెలిచిన పార్టీ..రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. ఉదాహరణకు ఏలూరు, మచిలీపట్నం లాంటి స్థానాలు. కానీ ఈ ఉరవకొండ రివర్స్. టీడీపీ ఆవిర్భావం అంటే 1983 టూ1994 వరకు ఇక్కడ ఒకలా జరిగితే 1999 నుంచి 2019 వరకు మరొకలా జరుగుతూ వచ్చింది. అప్పటినుంచి ఉరవకొండలో గెలిచిన పార్టీ…రాష్ట్రంలో అధికారంలోకి రాదు.

అందులో పయ్యావుల కేశవ్‌కు ఆ సెంటిమెంట్ తగులుకుంది. 1994 నుంచి పయ్యావుల కేశవ్ ఉరవకొండ బరిలో ఉంటున్నారు. అయితే ఒక్క 1994లోనే టిడిపి నుంచి కేశవ్ గెలవడం, రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రావడం జరిగాయి. ఇక 1999లో కేశవ్ ఓడిపోగా, రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఇక 2004, 2009 ఎన్నికల్లో టిడిపి నుంచి కేశవ్ గెలవగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014లొ కేశవ్ ఓడిపోగా, రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఇక 2019 ఎన్నికల్లో కేశవ్ గెలవగా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

అంటే ఉరవకొండలో సెంటిమెంట్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఇటీవల అసెంబ్లీ లాబీలో వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని..పయ్యావుల మళ్ళీ గెలవాలని అన్నారు. అంటే రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రాదని అలా అన్నారు. కానీ కేశవ్ దానికి కౌంటర్ ఇచ్చారు..1994లో ఫలితాలు 2024లో రిపీట్ అవుతాయని అన్నారు.
అంటే అప్పుడు కేశవ్ గెలవడం, టిడిపి అధికారంలోకి రావడం జరిగాయి. మరి 2024లో కూడా దాదాపు అదే జరిగేలా ఉంది. లేటెస్ట్ సర్వేలు చూస్తుంటే ఈ సారి ఉరవకొండ సెంటిమెంట్ బ్రేక్ అయ్యేలా ఉంది.
