ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం పెరిగింది. జగన్ ముందస్తుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. టిడిపి అధినేత చంద్రబాబు సైతం ముందస్తు గురించి పలుమార్లు చెబుతూ వస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన రెడీగా ఉండాలని కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే క్రమంలో కొన్ని స్థానాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేస్తున్నారు. మినీ మేనిఫెస్టో ప్రకటించారు. తాజాగా సత్తెనపల్లి నియోజకవర్గానికి కన్నా లక్ష్మీనారాయణని ఇంచార్జ్‌గా పెట్టారు.
అలాగే చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని గంగాధర నెల్లూరు ఇంచార్జ్ గా డాక్టర్ విఎం థామస్‌ని ఇంచార్జ్ గా పెట్టారు. అయితే ఇంకా జిల్లాలో పూతలపట్టు, చిత్తూరు స్థానాల్లో ఇంచార్జ్ లని ప్రకటించాల్సిన అవసరం ఉంది. పూతలపట్టులో టిడిపికి పెద్ద పట్టు లేదు గాని..చిత్తూరు అసెంబ్లీలో బలం ఉంది. కానీ ఇంతకాలం ఇంచార్జ్ లేకుండా బండి లాగించేశారు. గత ఎన్నికల్లో టిడిపి నుంచి ఏఎస్ మనోహర్ పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక ఆయన పార్టీకి దూరమయ్యారు. అప్పటినుంచి అక్కడ టిడిపి ఇంచార్జ్ లేరు. పలువురు నేతలు పదవి కోసం పోటీ పడుతున్నారు గాని చంద్రబాబు ఎవరికి క్లారిటీ ఇవ్వడం లేదు.

అదే సమయంలో చిత్తూరులో పట్టున్న సీకే బాబుని టిడిపిలోకి తీసుకొచ్చి సీటు ఇస్తారనే ప్రచారం ఉంది. కానీ ఆయన చేరికపై క్లారిటీ లేదు. ఇంకా ద్వితీయ శ్రేణి నేతలు సీటు ఆశిస్తున్నారు. కానీ సీటు ఎవరికి అనేది బాబు తేల్చడం లేదు. అదే సమయంలో పొత్తు ఉంటే ఈ సీటు జనసేన ఇస్తారా? అనే క్లారిటీ రావడం లేదు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడటంతో త్వరగా అభ్యర్ధిని ఫిక్స్ చేస్తే బెటర్..లేదంటే నియోజకవర్గంలో టిడిపికి నష్టం.