టీడీపీ-జనసేన పొత్తులో కొన్ని సీట్ల విషయంలో ఇబ్బందులు ఉన్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్న నేపథ్యంలో కొన్ని సీట్లు షేర్ చేసుకోవాల్సి ఉంది. మామూలుగా జనసేనకు ఎలాగో అన్నీ స్థానాల్లో బలం లేదు.. అందుకే జనసేనకు పెద్దగా సీట్లు త్యాగం చేయాల్సిన అవసరం రాదు. కానీ టిడిపికి అన్నీ స్థానాల్లో పట్టు ఉంది. దీంతో టిడిపి సీట్లు త్యాగం చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే కొన్ని సీట్లని జనసేనకు ఇవ్వడానికి టిడిపి రెడీగానే ఉంది.
కానీ కొన్ని సీట్లలో కాస్త ఇబ్బందులు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం సీటు విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. మామూలుగా ముమ్మిడివరం టిడిపి కంచుకోట. అక్కడ టిడిపి ఆరు సార్లు గెలిచింది. కానీ గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. వైసీపీ గెలవడానికి ఒకే ఒక కారణం అది..టిడిపి, జనసేనల మధ్య ఓట్లు చీలడం.

కేవలం 5 వేల ఓట్ల తేడాతో టిడిపిపై వైసీపీ గెలిచింది. అదే సమయంలో అక్కడ జనసేనకు 33 వేల ఓట్లు పడ్డాయి. అంటే టిడిపి, జనసేన కలిసి ఉంటే డౌట్ లేకుండా వైసీపీ గెలిచేది కాదు. ఇక వైసీపీని ఓడించడానికే రెండు పార్టీలు పొత్తులో వెళుతున్నాయి. కానీ ముమ్మిడివరం సీటు తమదంటే తమదని టిడిపి, జనసేన నేతలు ప్రకటించుకుంటున్నారు. ఇదే సమయంలో పవన్ పర్యటన ఉంది. దీంతో జనసేన నేతల్లో ఉత్సాహం ఉంది. ఈ సీటు జనసేనకే అంటున్నారు.
కానీ టిడిపి నేత దాట్ల సుబ్బరాజు అలియాస్ బుచ్చిబాబు మాత్రం ముమ్మిడివరం వదిలే పరిస్తితి లేదని..తానే పోటీ చేస్తానని అంటున్నారు. దీంతో సీటు విషయంలో క్లారిటీ లేదు. నిజానికి ఇక్కడ టిడిపికే బలం ఎక్కువ. మరి ఈ సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.