రాజకీయాల్లో గెలుపోటములని తారుమారు చేసే శక్తి మహిళలకు ఉంటుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..వారు తలుచుకుంటే ప్రభుత్వాలు ఏర్పడతాయి..ప్రభుత్వాలు కూలతాయి. అందుకే ఏ నాయకుడైన మొదట మహిళలని ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటారు. ఇక మహిళల తర్వాత అత్యధిక ప్రాధాన్యత ఉన్నవారు రైతులు, యువత..వీరి పాత్ర కూడా గెలుపోటముల్లో చాలా ఎక్కువ.
అంటే ఈ మూడు వర్గాలు ఎన్నికల సమయంలో చాలా కీలకం.. వీరి ఓట్లని మెజారిటీ సంఖ్యలో దక్కించుకుంటే ఆ పార్టీకి తిరుగుండదు. గత ఎన్నికల్లో ఈ మూడు వర్గాలు వైసీపీ వైపే మొగ్గు చూపాయి. జగన్ ఇచ్చిన కొన్ని హామీలకు ఆకర్షితులు అయ్యారు. అయితే అందులో కొన్ని హామీలని జగన్ విస్మరించారు. దీంతో ఈ వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ఇదే సమయంలో వారిని ఆకట్టుకోవడానికి చంద్రబాబు సరికొత్త హామీలతో ముందుకొచ్చారు. వారికి కీలక హామీలు ఇచ్చారు. జగన్ చేయలేనిది బాబు చేసి చూపించాలని రెడీ అయ్యారు.

ముఖ్యంగా మహిళలపై వరాల జల్లు కురిపించారు. 18 నుంచి 59 ఏళ్ల వరకు ఉన్న మహిళలకు నెలకు రూ.1500..తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉన్న ఏడాదికి రూ.15 వేలు..ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..అటు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ. 3వేలు, రైతులకు ఏటా రూ.20 వేల పంట సాయం.ఇలా కీలక హామీలు ఇచ్చారు.
ఈ హామీలతో ఆ వర్గాలు టిడిపి వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు టిడిపికి ఎక్కువ మద్ధతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూసి మోసపోయిన యువత సైతం ఇప్పుడు టిడిపి వైపుకు రావడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి బాబు హామీలు టిడిపి గెలుపుకు బాట వేస్తాయో లేదో.