టీడీపీ సీనియర్ నాయకుడు.. గురజాల మాజీ ఎమ్మెల్యే.. యరపతినేని శ్రీనివాసరావుకు .. పార్టీపై మంచి పట్టున్న విషయం తెలిసిందే. పార్టీ అధినేత చంద్రబాబు దగ్గర కూడా ఆయనకు మంచి మార్కులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా.. వైఎస్ హవా కొనసాగిన సమయంలోనూ ఆయన గురజాల నియోజకవర్గం నుంచి వరుస విజయాలు దక్కించుకున్నారు. 2009, 2014లో ఆయన గురజాల నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా.. వాలిపోయే తత్వం ఉన్న నాయకుడిగా.. ఆయన పేరు తెచ్చుకున్నారు.

పేదింటి ఆడపిల్లల వివాహాలకు ఆయనే పెద్దగా మారి.. అన్నీ ఆయనే భరించి వివాహాలు జరిపించారు. అంతేకాదు.. స్థానికంగా.. పేదల పిల్లలకు చదువు చెప్పించడం నుంచి పుస్తకాలు.. దుస్తులు.. సైకిళ్లు.. ఇలా అనేక రూపాల్లో సాయం చేసి.. ప్రజల మనిషిగా ఆయన పేరుతెచ్చుకున్నారు. ఏదైనా విపత్తులు సంభవించినా.. ఉపాధి కోల్పోయినా.. పేదలకు బియ్యం, నిత్యవసరాలను భారీ ఎత్తున ఉచితంగా పంచి.. తనలోని మానవత్వాన్ని ఆయన చాటుకున్నారు. ఇక్కడ యరపతినేని గురించి చెప్పుకొనేటప్పుడు.. ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి.

గత ఎన్నికలకు ముందు.. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన.. పసుపు-కుంకుమ పథకం యరపతినేని సూచనల మేరకే బాబు అమలు చేయడం గమనార్హం. అయితే.. అలాంటి నేత కూడా గత ఎన్నికల్లో వైసీపీ సునామీ తో స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ.. ఆయన నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. వారి సమస్యలు వింటున్నారు. వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. తన ఇంటికి ఎప్పుడు ఎవరు వచ్చినా.. వారి సమస్యలు విని.. పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు.

అయితే.. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన పార్టీని పటిష్ట పరిచేందుకు నడుం బిగించారు. వైసీపీ ప్రభుత్వం రావడంతో.. టీడీపీ నేతలపై కేసులు పెడుతున్న విషయం తెలిసిందే. దీంతో కార్యకర్తలు.. జెండా పట్టుకునేందుకు కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో యరపతినేని.. తాజాగా పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. రండి.. అందరం కలిసి.. పార్టీని నిలబెడదాం. కేసులకు వెరవాల్సిన అవసరం లేదు. అని ఆయన పిలుపునిస్తున్నారు.అంతేకాదు.. ప్రతి పల్లెలోనూ.. ప్రతి మండలంలోనూ తాను వస్తానని.. పార్టీ తరఫున విస్తృతంగా కార్యక్రమా లు నిర్వహిద్దామని.. ఆయన పిలుపునిస్తున్నారు.

ప్రతి ఒక్కరిలోనూ ఆయన ధైర్యం నింపుతున్నారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ యరపతినేని శ్రీనివాసరావు తన పట్టును నిరూపించుకున్నారు. ఆ జోష్ తోనే ఆయన నియోజకవర్గం మొత్తం పర్యటిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక, యరపతినేని పిలుపునకు స్థానికులు కూడా భారీ ఎత్తున స్పందిస్తున్నారు. ఇక, రాబోయే రోజుల్లో గురజాలలో మళ్లీ యరపతినేని హవా ప్రారంభం కావడం తథ్యమని అంటున్నారు పరిశీలకులు.

Discussion about this post