వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు మేలైన పనులు ఎన్ని చేశారో క్లారిటీ లేదు గాని..ప్రతిపక్ష టీడీపీని ఎన్ని రకాలుగా దెబ్బతీయడానికి చూశారో రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. చంద్రబాబుని, టీడీపీ నేతలని, కార్యకర్తలకు ఎన్ని రకాలుగా చుక్కలు చూపించారో చెప్పాల్సిన పని లేదు. వరుసపెట్టి కేసులు పెట్టడం, అరెస్టులు జరగడం కామన్ అయిపోయింది. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు బాగా కసితో ఉన్నారనే విషయం కూడా తెలిసిందే.

అందుకే రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవని, అధికారం శాశ్వతం కాదని చెప్పి చంద్రబాబు ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. అధికారంలోకి వస్తే అందరి లెక్కలు తేలుస్తామని అంటున్నారు. ఇక బాబు మాత్రమే కాదు..టీడీపీ నేతలు, కార్యకర్తలు అదే తరహలో మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు రగిలిపోతున్న విషయం తెలిసిందే. అక్కడ అధికార వైసీపీ దెబ్బకు చాలామంది టీడీపీ నేతలకు చుక్కలు కనబడుతున్నాయి.

అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక మాచర్లలో వైసీపీ విధ్వంస కాండ కొనసాగుతుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇటీవల కూడా మాచర్లలో వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది. అయితే పోలీసులు వైసీపీకి కొమ్ముకాసి టీడీపీ వాళ్లపై కావాలని కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా నరసారావుపేటలో ఓ టీడీపీ కార్యకర్త హత్య జరిగింది.

ఇది వైసీపీ పని అని టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కానీ పోలీసులు మాత్రం హత్యలు చేసే వైసీపీకే కొమ్ముకాస్తున్నారని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం మారితే ఎవ్వరిని వదిలిపెట్టమని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇప్పడు అక్రమాలకు పాల్పడే పోలీసులు రేపు నిందితులుగా మారతారన్నారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
