ఏ రాజకీయ నాయకుడికైనా.. నాయకురాలికైనా.. ప్రత్యర్తి పార్టీల నుంచి వ్యతిరేకత వస్తుంది. లేదా.. ప్రత్యర్థి పార్టీల నుంచి తిరుగు బాటు కనిపిస్తుంది. కానీ, అధికార పార్టీ వైసీపీలో మాత్రం సొంత పార్టీ నేతపైనే నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అది కూడా లేడీ ఎమ్మెల్యేపై.. నేతలు నిప్పులు చెరుగుతున్నారు. “ఆమె మాకు వద్దు!“ అంటూ.. తేల్చి చెబుతున్నారు. మరి ఇంతకీ ఆ లేడీ ఎమ్మెల్యే ఎవరు? ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? అనేది ఆసక్తిగామారింది. విషయంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న ఉన్నత విద్యావంతురాలు.. వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిపై స్థానిక వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.

గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో భేటీ అయిన వైసీపీ నాయకులు.. ఆమెకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఎమ్మెల్యే ఏకప క్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని.. పదవులను అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారని.. నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి.. విషయం వివరించాలని కూడా నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి ఆది నుంచి కూడా ఉండవల్లి శ్రీదేవిపై స్థానికంగా.. పాజిటివ్ కామెంట్లు వినిపించలేదు. ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కేడర్‌ను దూరం పెట్టడం.. వివాదాలకు దగ్గరగా ఉండడం అనేది ఆమెకు షరా మామూలే అన్నట్టుగా మారిపోయింది.

అంతేకాదు.. వైసీపీలోనే రెండు గ్రూపులను ఏర్పాటు చేసుకుని.. తనకు అనుకూలంగా ఉండేవారిని ప్రోత్సహించడం.. వ్యతిరేకం గా ఉండేవారిపై పోలీసులతో కేసులు పెట్టించడం వరకు కూడా విషయం వెళ్లింది. అదేసమయంలో ఓ సీఐని బెదిరిస్తూ.. చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. ఇది పార్టీకి, ఆమెకు కూడా బ్యాడ్ నేమ్ తెచ్చింది. ఇక, స్థానికంగా పనులు చేసే కాంట్రాక్టర్లను కూడా పీడిస్తున్నారని.. పనులు చేయాలంటే.. కప్పం కట్టాలంటూ.. ఒత్తిడి తెస్తున్నారని.. కొందరు కాంట్రాక్టర్లు అప్పట్లోనే తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. పనులు కూడా నిలిపి వేసుకుని.. ఎమ్మెల్యేపై చర్యలకు పట్టు బట్టడం స్థానికంగా తీవ్ర వివాదానికి దారితీసింది.

ఇదే సమయంలో ఎంపీ, ఎమ్మెల్యేలతోనూ ఉండవల్లి శ్రీదేవి కయ్యానికి కాలు దువ్వారు. ఫలితంగా ఒకానొక దశలో అధిష్టానం కూడా ఆమెను పిలిచి.. తలంటిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు వివాదాలకు దూరంగా ఉన్నప్పటికీ.. మళ్లీ ఇటీవల కాలంలో వివాదాలకు కేంద్రంగా మారారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. స్థానిక నేతలను లెక్కచేయక పోవడం… వలంటీర్ వంటి ఉద్యోగాలను కూడా(ఇటీవల నలుగురు వదిలేశారు) అమ్ముకునేందుకు ప్రయత్నించడం.. రాజధానిపై ఇప్పటికీ అంతర్గతంగా విమర్శలు చేయడం వంటివి స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే శ్రీదేవిపై సొంత పార్టీ నేతలే.. విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమెపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. మరి ఇది ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.

Discussion about this post