అధికార వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేలు వివాదాల్లో ఉంటున్న విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే వివాదాల్లో ఎక్కువ శాతం గుంటూరు ఎమ్మెల్యేలే కనిపిస్తున్నారు. గుంటూరులోనే ఎక్కువ రచ్చ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడులు కంటిన్యూగా వివాదాల్లోనే ఉంటున్నారు.

అసలు బొల్లా అయితే వివాదాల్లోనే తోపు అన్నట్లు ఉంటున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇళ్ల స్థలాల్లో అక్రమాలకు పాలడ్డారని, అలాగే బైపాస్ రోడ్డు విషయంలో రైతులని బెదిరించారని, ఆ మధ్య కోవిడ్ సమయంలో పేదలకు అండగా ఉన్న శివశక్తి అనే సంస్థని అడ్డుకున్నారు. ఇలా అనేక విషయాల్లో బొల్లా వివాదాల్లో చిక్కుకుంటూ వస్తున్నారు.

తాజాగా కూడా బొల్లా మరొక వివాదంలో చిక్కుకున్నారు. వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో వైసీపీకి చెందిన ఓ నేత కుటుంబ సభ్యుడు చనిపోయారు. ఇక ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వచ్చారు. ఇదే సమయంలో అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్త, రైతు గడిపూడి నరేంద్ర ధాన్యం కొనుగోలు అంశంలో ఉన్న ఇబ్బందులని ఎంపీకి వివరించే ప్రయత్నం చేశారు.

గిట్టుబాటు ధర, ఆర్బీకేల్లో కొనుగోలు అంశంపై మాట్లాడారు. అయితే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసే ధాన్యానికి డబ్బులు ఇస్తామనే భరోసా ఎవరు ఇస్తారని ఎంపీని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఎంపీ పక్కనే ఉన్న ఎమ్మెల్యే బొల్లా ఒక్కసారిగా చెప్పు తీసి..రైతుని కొట్టబోయారు. దీంతో రైతు కూడా ఎదురు తిరిగారు. అయితే వెంటనే ఎమ్మెల్యే…పోలీసులని పిలిపించి ఆ రైతుని అరెస్ట్ చేయించారు. ప్రశ్నించిన రైతుని కొట్టబోయింది కాకుండా, జైల్లో పెట్టించడంతో వేల్పూరు గ్రామస్తులు ఎమ్మెల్యేపై ఫైర్ అవుతున్నారు. ఇలా ఎప్పటికప్పుడు బొల్లా వివాదాలతో హైలైట్ అవుతున్నారు.

Discussion about this post