ఏపీలో అధికార వైసీపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. ఓ వైపు జగన్ ఇమేజ్ తగ్గుతున్నట్లు సర్వేలు వస్తున్నాయి. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. అటు వైసీపీలో నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష టిడిపి బలపడుతుంది..అటు జనసేనతో పొత్తు కలిసొచ్చే ఛాన్స్ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి సొంత ఎమ్మెల్యేలు షాక్ ఇస్తున్నారు.

అది కూడా సొంత సామాజికవర్గమైన రెడ్డి వర్గానికి చెందిన నేతలే వైసీపీకి షాక్ ఇస్తున్నారు. అసలు వైసీపీకి రెడ్డి వర్గమే ఆయువుపట్టు. వైసీపీలో ఎక్కువ మంది రెడ్డి ఎమ్మెల్యేలే ఉన్నారు. అలాంటి రెడ్డి వర్గం ఇప్పుడు రివర్స్ అవుతుంది..అందులోనూ వైసీపీకి వీర విధేయుడుగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..వైసీపీకి షాక్ ఇచ్చారు. తన ఫోన్‌ని వైసీపీ అధిష్టానం ట్యాప్ చేస్తుందని, నమ్మకం లేని చోట ఉండనని చెప్పేశారు. అటు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి ఎలాగో వైసీపీకి దూరమయ్యారు. ఈయన ముందు నుంచి సొంత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.

ఈ ఇద్దరు వైసీపీని వీడటం ఖాయమైంది..అటు తాజాగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం వైసీపీ అధిష్టానంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అలాగే ఇంకా రెడ్డి వర్గానికి చెందిన నేతలు వైసీపీని వీడటానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే డీఎల్ రవీంద్రా రెడ్డి, వీరాశివారెడ్డి, వరదరాజులు రెడ్డి…ఈ నేతలు సైతం టిడిపిలో చేరడానికి సిద్ధమవుతున్నారు.


ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో సైతం కొందరు రెడ్డి నేతలు వైసీపీని వీడి టిడిపిలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి వైసీపీకి ప్రదాన బలమైన రెడ్లు..ఆ పార్టీకి షాక్ ఇస్తూ టిడిపి వైపు రావడానికి చూస్తున్నారు.
