పామర్రు, చంద్రగిరి నియోజకవర్గాలు..అదేంటి..ఒకటి ఏమో కృష్ణా జిల్లాలో ఉన్న స్థానం..మరొకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న స్థానం..ఆ రెండిటికి పొంతన ఏంటి అని అనుకోవచ్చు. ఆ రెండు స్థానాలకు లింక్ ఒకటి ఉంది. కృష్ణా జిల్లా టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పుట్టిన జిల్లా. చిత్తూరు టిడిపి అధినేత చంద్రబాబు సొంత జిల్లా.
ఇక కృష్ణా జిల్లాలో ఉన్న పామర్రు నియోజకవర్గంలో ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు గ్రామం ఉంది. ఇటు చంద్రగిరిలో చంద్రబాబు పుట్టిన నారావారిపల్లె ఉంది. అంటే పామర్రు ఎన్టీఆర్ సొంత గడ్డ, చంద్రగిరి చంద్రబాబు సొంత గడ్డ. కానీ ఈ రెండు చోట్ల వైసీపీ హవా ఉండటం విశేషం. మొదట పామర్రు గురించి మాట్లాడుకుంటే 2008లో ఏర్పడిన ఈ స్థానంలో టిడిపి ఇంతవరకు గెలవలేదు. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. ఇప్పటికీ అక్కడ టిడిపి బలపడలేదని తాజా సర్వేలు చెబుతున్నాయి.

పామర్రులో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది..కానీ అక్కడ ఎస్సీ వర్గం హవా ఉండటం..వారు వైసీపీ వైపు ఎక్కువ మద్ధతు ఉండటం వల్ల పామర్రులో టిడిపికి ఛాన్స్ రావడం లేదు. ఇటీవల సర్వేలో కూడా పామర్రులో వైసీపీ గెలిచే ఛాన్స్ ఉందని తేలింది. ఇటు చంద్రగిరికి వస్తే 1978లో చంద్రబాబు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 1983లో టిడిపి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన టిడిపి లోకి వచ్చి కుప్పం నుంచి గెలుస్తున్నారు. కానీ చంద్రగిరిలో టిడిపి గెలుపుకు దురమైంది. 1994లో మళ్ళీ ఒకసారి గెలవగా, అక్కడ నుంచి గెలవడం లేదు.
గత రెండు ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తూ వస్తుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ నుంచి గెలుస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో కూడా ఆయన గెలుపుని ఆపడం కష్టమే అని తేలింది. అంటే పామర్రు-చంద్రగిరి స్థానాల్లో టిడిపికి గెలుపు కల అని చెప్పవచ్చు.
