రాజకీయాల్లో ఎప్పుడు నేతలు కాస్త విలువలు పాటించాలి..చెప్పిన మాట మీద నిలబడాలి. అప్పుడే జనాల మద్దతు ఉంటుంది. కాస్త విశ్వసనీయత ఉంటుంది. అలా కాకుండా మాటల్లో విశ్వసనీయత అని చేతల్లో లేకపోతే జనం నమ్మడం కష్టం. అదేవిధంగా ప్రతిసారి రాజకీయాల్లో సెంటిమెంట్ వర్కౌట్ చేయాలన్న కష్టమే. ఏదో డ్రామాలు ఆడుతూ..సెంటిమెంట్ రగిలించడానికి చూస్తే ప్రజలు రివర్స్ అవుతారు.

ఇప్పుడు ఏపీలో వైసీపీకి అదే జరిగేలా ఉంది. ఎందుకంటే జగన్ ప్రతిసారి సెంటిమెంట్ తోనే గెలవాలని చూస్తున్నారు. అసలు వైసీపీ పుట్టిందే వైఎస్సార్ చనిపోయిన సెంటిమెంట్ పై..ఇక 2012 ఉపఎన్నికల్లో జగన్ జైలుకు వెళ్లారనే సెంటిమెంట్ తో వైసీపీ గెలిచింది. కానీ 2014 ఎన్నికలకు వచ్చేసరికి రివర్స్ అయింది. వైసీపీ గెలవలేదు. మళ్ళీ లేనిపోనివి చెప్పి..టిడిపిని నెగిటివ్ చేసి..అనేక వాగ్దానాలు చేసి..ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని జనాల్లో సెంటిమెంట్ లేపి జగన్..2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు.
మరి అధికారంలోకి వచ్చాక జగన్ ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నారా? అంటే అది జనాలకే తెలియాలి. ఉదాహరణకు మద్యపాన నిషేధం గురించే చెప్పుకోవాలి. దీంతోనే జగన్ మాట తప్పారో, నిలబెట్టుకున్నారో అర్ధమవుతుంది. పైగా మళ్ళీ గెలవడానికి సెంటిమెంట్ లేపుతున్నారు. ప్రతిపక్షాల పొత్తుపై మాట్లాడుతూ..తాను ఒంటరి అని, ప్రజలే తనకు అండగా ఉండాలని, తనకు ఆస్తులు లేవు, కుయుక్తులు తెలియవని, సొంత మీడియా లేదని..ఎవరితో పొత్తు లేదని..ప్రజలతోనే పొత్తు అని అంటున్నారు.
జగన్ ఆస్తుల గురించి ఎందుకులే గాని..ఆయనకు సొంత మీడియా, సపోర్ట్ మీడియా ఉందో లేదో ప్రజలకు తెలుసు. మరీ గుడ్డిగా అబద్దాలు చెబితే ప్రజలు ఎలా నమ్ముతారని అనుకుంటున్నారో అర్ధం కావడం లేదు. పైగా అధికారంలోకి వచ్చాక ప్రజలపై పన్నుల భారం పెంచి ఆర్ధికంగా నష్టం చేశారు. అన్నీ చేసి కూడా ప్రజలకు మేలు చేశానని చెప్పుకోవడం పెద్ద వింత. కాబట్టి జగన్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడం అనేది జరిగే పని కాదు.
