మొన్నటివరకు అధికార వైసీపీ..టిడిపిని టార్గెట్ చేస్తూ ఎలాంటి రాజకీయం చేసింది..ఎలాంటి మైండ్ గేమ్ ఆడిందో తెలిసిందే. అసలు టిడిపిని అణిచివేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగాయో చెప్పాల్సిన పని లేదు. ఇక అధికారంలోకి వచ్చాక ఏ స్థాయిలో టిడిపి నేతలని లాక్కున్నారో తెలిసిందే. అలాగే నలుగురు ఎమ్మెల్యేలని సైతం లాక్కున్నారు. ఇంకా ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని మైండ్ గేమ్ ఆడారు. చంద్రబాబు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని వైసీపీ నేతలు కామెంట్ చేశారు.
కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది..టిడిపి మైండ్ గేమ్ కు వైసీపీలో టెన్షన్ పెరిగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు చేసి టిడిపిని గెలిపించేసరికి వైసీపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడే పరిస్తితి. అయితే ఆ నలుగురే కాదు..ఇంకా ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టిడిపి ఆడుతున్న మైండ్ గేమ్ కు వైసీపీకి చెమటలు పడుతున్నాయి.

పోలింగ్ జరుగుతుండగానే 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, 11 మంది ఆల్రెడీ మాట్లాడారని టిడిపి నేతలు కామెంట్ చేశారు. అయితే అందులో నలుగురు ఎమ్మెల్యేలు టిడిపికి క్రాస్ ఓటింగ్ వేశారు. ఎలాగో రెబల్స్ గా ఉన్నా ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపికే ఓటు వేశారని తెలుస్తోంది. ఈ ఇద్దరు కాకుండా మరో ఇద్దరు క్రాస్ ఓటింగ్ చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరనే దానిపై వైసీపీలో చర్చలు నడుస్తున్నాయి.
అయితే వీరే కాదు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు టిడిపికి టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. కాకపోతే అందరినీ టిడిపిలోకి ఆహ్వానించే పరిస్తితి లేదు. ఏదో బలమైన నాయకులనే టిడిపిలోకి తీసుకుంటారని తెలుస్తోంది. వారికే సీటు హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు టిడిపి వైపుకు వస్తారో చూడాలి.
