గత ఎన్నికల్లో సంచలన ఓటములు నమోదైన నియోజకవర్గాల్లో గాజువాక కూడా ఒకటి. ఇక్కడ పవన్ కల్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు. అదే సమయంలో భీమవరంలో కూడా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇలా రెండు చోట్ల ఓడిపోయిన పవన్..ఈ సారి ఎన్నికల్లో ఒక సీటులోనే పోటీ చేయడానికి చూస్తున్నట్లు తెలిసింది. కాకపోతే ఇప్పటివరకు ఆయన పోటీ చేసే సీటుపై ఏ మాత్రం క్లారిటీ రాలేదు.
కానీ జనసేన వర్గాల సమాచారం ప్రకారం భీమవరం నుంచే ఆయన మళ్ళీ పోటీ చేస్తారని తెలుస్తోంది. దీంతో గాజువాక బరిలో ఉండరని తెలుస్తోంది. తాజాగా గాజువాకలో పర్యటించిన ఆయన..ఈ సారి గాజువాకలో జనసేన జెండా ఎగరనుందని అన్నారు..కానీ ఆయనే నేరుగా పోటీ చేస్తారని చెప్పలేదు. సరే జనసేన అభ్యర్ధి ఇక్కడ పోటీ చేసి గెలుస్తారని ఆయన చెప్పి ఉంటారు..కానీ ఇక్కడ చర్చ అది కాదు..టిడిపితో పొత్తు ఉంటే అప్పుడు గాజువాక సీటు ఎవరికి అనేది చర్చ. దాదాపు టిడిపి-జనసేనల మధ్య పొత్తు ఖాయమనే ప్రచారం వస్తుంది.
అలాంటప్పుడు గాజువాక సీటు టిడిపి..జనసేనకు వదిలి పెడుతుందా? అనేది చెప్పలేం. పవన్ నేరుగా పోటీ చేస్తే టిడిపి త్యాగం చేసే ఛాన్స్ ఉంది. ఆయన గాజువాక కాకుండా వేరే సీటులో పోటీ చేసే లెక్క అయితే..గాజువాక టిడిపి వదులుకోవడం కష్టమే. ఇక్కడ టిడిపి నేత పల్లా శ్రీనివాసరావు ఉన్నారు..ఈయనకు రాజకీయంగా బలం ఉంది.
ఇక పల్లా కాకుండా అక్కడ జనసేనకు సీటు ఇస్తే..టిడిపి శ్రేణులు ఎంతవరకు సహకరిస్తాయో చెప్పలేం. పైగా జనసేనలో పవన్ తప్ప..గాజువాకలో బలమైన లీడర్ లేరు. కానీ గాజువాక సీటు జనసేనకే అని పరోక్షంగా పవన్ చెప్పారు. అలాంటప్పుడు టిడిపి ఏం చేస్తుంది..పల్లాకు ఏ సీటు ఇస్తుంది. గాజువాక వదులుకుంటుందా? అనేది చూడాలి. పొత్తు లేకపోతే ఏ గోల ఉండదు..పొత్తు ఉంటేనే సీటుపై రచ్చ ఖాయం.