ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ పుట్టిన గడ్డ అనే సంగతి తెలిసిందే. అందుకే ముందు నుంచి ఈ జిల్లాలో టిడిపి హవా ఉంటుంది. జిల్లాలో పార్టీ బలంగా ఉన్న అసలు ఎన్టీఆర్ పుట్టిన వూరు నిమ్మకూరు ఉన్న పామర్రు నియోజకవర్గంలో టిడిపి హవా ఉండటం లేదు. ఇంతవరకు అక్కడ టిడిపి గెలవలేదు..పైగా వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచే ఛాన్స్ లేదంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
2009లో ఏర్పడిన ఈ పామర్రులో టిడిపి ఇంతవరకు గెలవలేదు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ చేతుల్లో ఓడింది. 2014 ఎన్నికల్లో గెలుపు దగ్గర వరకు వచ్చి బోల్తా కొట్టింది. కేవలం వెయ్యి ఓట్ల తేడాతో టిడిపి ఓడిపోయింది. ఇక వైసీపీ నుంచి గెలిచిన ఉప్పులేటి కల్పనని టిడిపిలోకి తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో ఆమె టిడిపి నుంచి పోటీ చేశారు…కానీ ఘోరంగా 30 వేల ఓట్ల పైనే మెజారిటీతో ఓడిపోయారు. ఓడిపోయాక పార్టీని పట్టించుకోలేదు. దీంతో పామర్రులో పార్టీ వీక్ అవుతూ వస్తుంది.

పైగా వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది..అయినా సరే టిడిపికి అడ్వాంటేజ్ లేదు. ఇదే క్రమంలో వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజాని పామర్రు ఇంచార్జ్ గా పెట్టారు. ఆయన వచ్చాక కాస్త పరిస్తితి మారింది. టిడిపి బలపడుతూ వచ్చింది. అయినా సరే ఇంకా వెనుకే ఉంది. దాదాపు 10 వేల ఓట్లు వెనుకబడే ఉందని సర్వేల్లో తేలుతుంది. అంటే ఇక్కడ టిడిపి ఇంకా కష్టపడాలి. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి..కాస్త కష్టపడితే ఈ సారైనా పామర్రులో పసుపు జెండా ఎగురుతుంది..లేదంటే అన్నీ సర్దేసుకోవచ్చు.