ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఒకప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలని ప్రజలు పెద్దగా పట్టించుకున్న సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు వైసీపీ వచ్చాక ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి కూడా అడ్డదారులు, అధికార బలం ఉపయోగించడంతో అంతా ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇక ఈ నెల 16న ఫలితాలు వస్తాయి.
ఈ నెల 23న ఎమ్మెల్యేల కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ 7 స్థానాలని కైవసం చేసుకోవాలని వైసీపీ చూస్తుంది. ఏడుగురు అభ్యర్ధులని ప్రకటించింది. అయితే ఒక్కో ఎమ్మెల్సీ దక్కాలంటే 22 ఎమ్మెల్యేలు కావాలట. అయితే వైసీపీ బలం 151..ఇక టిడిపి నుంచి నలుగురు, జనసేన నుంచి ఒకరు వైసీపీ వైపుకు జంప్ చేశారు. దీంతో 156 బలం అవుతుంది. ఈ బలంతో ఇంచుమించు 7 స్థానాలు కైవసం చేసుకోవచ్చు.

కాకపోతే ఇక్కడే టిడిపి ట్విస్ట్ ఇచ్చింది. ఒక ఎమ్మెల్సీ స్థానం బరిలో టిడిపి బరిలో నిలబడింది. టిడిపి అభ్యర్ధిగా పంచుమర్తి అనురాధ నామినేషన్ వేశారు. దీంతో ఎమ్మెల్సీ పోరు రసవత్తరంగా మారింది. 6 స్థానాలని వైసీపీ సులువుగానే కైవసం చేసుకుంటుంది. 7 వ స్థానంలోనే పోటీ ఉంటుంది. మామూలుగా టిడిపికి 23 మంది ఎమ్మెల్యేలు..అంటే ఒక ఎమ్మెల్సీ కైవసం చేసుకోవచ్చు. కానీ నలుగురు వైసీపీ వైపు జంప్ కొట్టారు. దీంతో టిడిపి బలం 19కి వచ్చింది.
అదే సమయంలో వైసీపీకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి దూరమయ్యారు. వారు గాని టిడిపికి మద్ధతు ఇస్తే 21 అవుతుంది. అలాగే ఒకరిద్దరు వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. అదే జరిగితే వైసీపీకి షాక్ తప్పదు. కాకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉంటుంది. అది ధిక్కరిస్తే రెండు పార్టీల్లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేల పదవులపై వేటు తప్పదు.