గత ఎన్నికల్లో కంచుకోటల్లాంటి స్థానాల్లో కూడా టిడిపి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అప్పుడు వ్యతిరేకత, జగన్ ఒక్క ఛాన్స్..జనసేన ఓట్లు చీల్చడం ఇలా పలు కారణాలతో కీలకమైన స్థానాల్లో టిడిపి ఓడింది. ఇదే సమయంలో అభ్యర్ధులని అటు ఇటు మార్చడం కూడా టిడిపికి మైనస్. గత ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో మార్పులు చేశారు.
ఇదే క్రమంలో పాయకరావుపేటలోని వంగలపూడి అనితని కొవ్వూరుకు పంపారు. కొవ్వూరులోని కేఎస్ జవహర్‌ని తిరువూరుకు మార్చారు. ఇక పాయకరావుపేటలో కొత్తగా బంగారయ్యని పోటీకి దించారు. ఇలా మార్పులు చేయడం టిడిపికి కలిసి రాలేదు. మూడు స్థానాల్లో టిడిపి దారుణంగా ఓడింది. కానీ తర్వాత చంద్రబాబు సమీకరణాలు మళ్ళీ లైన్ చేసేశారు. పాయకరావుపేటకు అనితని పంపేశారు. అటు కొవ్వూరుకు జవహార్ వచ్చారు. అయితే పేట గురించి మాట్లాడుకుంటే..ఈ స్థానం మొదట నుంచి టిడిపి కంచుకోట.1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరు సార్లు టిడిపి గెలిచింది. 2009లో ఓటమి పాలైంది. 2012 ఉపఎన్నికలో కూడా ఓడింది.

మళ్ళీ 2014లో టిడిపి గెలిచింది. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైంది. అయితే ఇప్పుడు సీన్ మారింది. టిడిపి ఆధిక్యంలోకి వచ్చింది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. సొంత పార్టీ వాళ్ళే ఆయన్ని ఓడిస్తానని అంటున్నారు. దీంతో వైసీపీకి మైనస్ గా ఉంది. అటు టిడిపి నాయకురాలు అనిత దూకుడుగా పనిచేస్తున్నారు.
ఈ సారి ఆమె టిడిపి నుంచి పోటీ చేయడం ఖాయం. అదే సమయంలో జనసేనతో పొత్తు టిడిపికి కలిసిరానుంది. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు 16 వేల ఓట్లు వరకు పడ్డాయి. ఇప్పుడు పొత్తు టిడిపికి కలిసొస్తుంది. ఈ సారి పాయకరావుపేటలో టిడిపి హవా ఖాయమే.