ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ఊపులో ఉన్న టిడిపికి మరింత ఊపు తీసుకొచ్చేలా చంద్రబాబు ముందుకెళ్లనున్నారు. ఓ వైపు లోకేశ్ పాదయాత్రతో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. మరో వైపు బాబు జనంలో తిరుగుతున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బాబు కాస్త బ్రేకు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వెళ్లనున్నారు. అలాగే టిడిపి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక నుంచి ఆయన ప్రజల్లోనే ఉండనున్నారు.
5వ తేదీన విశాఖ, 6వ తేదీన కడప, 7వ తేదీన నెల్లూరుల్లో జోనల్ సదస్సులో పాల్గొంటారు. ఒకో సదస్సులో 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు పాల్గొంటారు. ఆయా స్థానాల్లో నేతల పనితీరు గురించి చర్చించనున్నారు. పార్టీ బలోపేతంపై సూచనలు ఇవ్వనున్నారు. ఇక ఈ నెల 11న అమరావతిలో జరిగే ఇఫ్తార్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

ఇక ఈ నెల 12 నుంచి మూడు రోజులపాటు ఆయన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. 13న గుడివాడలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. వాస్తవానికి ఆయన గుడివాడ వచ్చి చాలా రోజులు అయింది. గతేడాది మినీ మహానాడు కార్యక్రమం ప్లాన్ చేశారు గాని..వర్షాల వల్ల ఆ కార్యక్రమం రద్దు అయింది.
ఆ తర్వాత అక్కడ ఏ కార్యక్రమం చేయలేదు. అయితే ఇప్పుడు గుడివాడలో భారీ సభ ప్లాన్ చేస్తున్నారు. ఈ సభ ద్వారా గుడివాడలో టిడిపిని బలోపేతం చేయడమే టార్గెట్ గా పెట్టుకొనున్నారు. ఇక్కడ కొడాలి నానికి చెక్ పెట్టాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ టిడిపికి పట్టు దొరకడం లేదు. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా నానికి చెక్ పెట్టాలని భావిస్తున్నారు.
కాకపోతే అక్కడ టిడిపి నుంచి పోటీ చేసే అభ్యర్ధి ఎవరు అనేది క్లారిటీ లేదు. రావి వెంకటేశ్వరరావు ఉన్నా సరే ఆయనకు పోటీగా పలువురు నేతలు ఉన్నారు. అయితే ఈ సభతో గుడివాడ అభ్యర్ధిని కూడా తేలుస్తారేమో చూడాలి.
