నారా లోకేష్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ఎంటర్ అవుతుంది..నెల్లూరులోని ఆత్మకూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర ఎంటర్ కాబోతుంది. ఇక నెల రోజుల పాటు ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాలు కవర్ చేస్తూ లోకేష్ పాదయాత్ర సాగనుంది. అయితే లోకేష్ పాదయాత్ర సందర్భంగా నెల్లూరులోని ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపి వైపుకు వచ్చారు. ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..లోకేశ్ పాదయాత్ర సక్సెస్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అధికారికంగా పార్టీలో చేరలేదు గాని..లోకేష్ పాదయాత్ర సక్సెస్ చేసేందుకు ముగ్గురు నేతలు సిద్ధమయ్యారు. ఇదే క్రమంలో ఆత్మకూరులో లోకేష్ పాదయాత్ర బాధ్యతలని ఆనంకు అప్పగించారు. అక్కడ ఊహించని విధంగా పాదయాత్ర సక్సెస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆత్మకూరు టిడిపికి పెద్దగా పట్టు లేని స్థానం ఎప్పుడో 1994లో అక్కడ చివరిగా గెలిచింది. తర్వాత ఎప్పుడు గెలవలేదు. కానీ ఈసారి తప్పకుండా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది.

ఇక్కడ వైసీపీ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఉన్నారు..మేకపాటి ఫ్యామిలీకి బలం ఉంది. ఇప్పుడు ఆనం రంగంలోకి దిగడంతో టిడిపికి ఊపు వచ్చింది. ఇక్కడ నుంచే ఆనం పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. రాపూరు నియోజకవర్గం మారిపోయాక 2009లో ఆనం..ఆత్మకూరు నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలిచారు. ఇక్కడ ఆయనకు పట్టు ఉంది. అయితే ఆనం లేదా ఆయన కుమార్తె కైవల్య రెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది.
ఇక ఆనం బరిలో దిగడంతో ఆత్మకూరులో టిడిపికి కొత్త ఉత్సాహం వచ్చింది. ఇటు లోకేష్ పాదయాత్ర సైతం పార్టీకి మైలేజ్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈ సారి ఆత్మకూరులో 25 ఏళ్ల తర్వాత టిడిపి జెండా ఎగిరేలా ఉంది