జనవరి 27న నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలైన విషయం తెలిసిందే. రాయలసీమ జిల్లా అయిన చిత్తూరులో పాదయాత్ర మొదలైంది. అది కూడా టిడిపి కంచుకోట కుప్పంలో మొదలుపెట్టారు. కుప్పం కాబట్టి ఎలాగో పాదయాత్ర సక్సెస్ అయింది. కానీ తర్వాత కొన్ని రోజులు అనుకున్న విధంగా పాదయాత్రకు ప్రజా స్పందన రాలేదనే చెప్పాలి. రాష్ట్ర స్థాయిలో హైలైట్ కాలేదు. జగన్ ప్రభుత్వం పాదయాత్రకు అడ్డంకులు సృష్టించాలని చూడటం..రోడ్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం ఇబ్బందులు వచ్చాయి.
కానీ ఇబ్బందులని సైతం తనకు అనుకూలంగా మార్చుకుంటూ..ప్రతి వర్గంతో భేటీ అవుతూ..వారి సమస్యలని తెలుసుకుంటూ..ప్రజలని కలుస్తూ..వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతూ లోకేష్ ముందుకెళ్లారు. దీంతో పాదయాత్రకు ప్రజా స్పందన బాగా వచ్చింది. నగరి, పలమనేరు, పీలేరు, మదనపల్లె లాంటి చోట్ల భారీ స్థాయిలో ప్రజలు వచ్చారు. నెక్స్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఊహించని విధంగా ప్రజా స్పందన వచ్చింది.

ఇక వైసీపీ కంచుకోట జిల్లా కర్నూలులో టిడిపి శ్రేణులు సైతం ఆశ్చర్యపోయేలా లోకేష్ పాదయాత్రలో ప్రజలు వచ్చారు. రోడ్ షో సభలకు భారీ స్థాయిలో జనం వచ్చారు. ఇక జగన్ సొంత గడ్డ కడపలో ఎవరూ ఊహించని విధంగా లోకేష్ పాదయాత్రకు ప్రజా స్పందన వచ్చింది. చివరికి బద్వేలులో లోకేష్ పాదయాత్ర ముగిసింది. నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ కాబోతున్నారు.
అయితే సీమలో లోకేష్ పాదయాత్ర టిడిపికి బాగా ఊపు తెచ్చింది. కొన్ని స్థానాల్లో ఆధిక్యంలోకి తెచ్చింది. లోకేష్ పాదయాత్ర ఊపుని టిడిపి నేతలు కొనసాగిస్తే సీమలో టిడిపి భారీ విజయాన్ని అందుకుంటుంది. గత ఎన్నికల్లో సీమలోని 52 సీట్లకు టిడిపి 3 సీట్లు గెలుచుకుంది. ఆ మూడు సీట్లని 30 సీట్లకు పెంచుకునే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం చిత్తూరులో 7, అనంతపురంలో 8, కర్నూలులో 7, కడపలో 3 స్థానాల్లో టిడిపికి ఆధిక్యం ఉంది. అంటే దాదాపు 25 సీట్లు. ఈ బలం మరింత పెరిగే ఛాన్స్ ఉంది.