టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా? అంటే ఉండే అవకాశాలే ఎక్కువ అని విశ్లేషకులు అంటున్నారు. ఈ రెండు పార్టీలతో బిజేపి కలుస్తుందా? లేదా? అనేది చర్చగా మారింది. అయితే పొత్తు ఉంటే ఒక తలనొప్పి లేకపోతే మరొకటి అన్నట్లు ఉంది. పొత్తు ఉంటే టిడిపి..బిజేపి, జనసేనల కోసం కొన్ని సీట్లు త్యాగం చేయాలి. ఆ సీట్లలో టిడిపి ఓట్లు ఎంతవరకు బదిలీ అవుతాయో చెప్పలేం. దాని వల్ల టిడిపికే నష్టం. అటు బిజేపిపై వ్యతిరేకత టిడిపికే డ్యామేజ్.
పొత్తు లేకపోతే జనసేన ఓట్లు చీల్చి టిడిపికి నష్టం చేస్తుంది. ఇలా రెండు రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. సరే పొత్తు దాదాపు ఉండేలా ఉంది. ఈ క్రమంలో సీట్ల పంపకాలపై కూడా చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి కృష్ణాలో సీట్ల విషయంలో టిడిపి, జనసేన శ్రేణుల మధ్య హీట్ డిస్కషన్ నడుస్తుంది. బిజేపి విషయం తేలలేదు కాబట్టి..దాన్ని పక్కన పెడితే..ఉమ్మడి కృష్ణాలో జనసేన ఐదు సీట్ల వరకు ఆశిస్తుందట.
గత ఎన్నికల్లో జనసేన ఒక్క సీటు గెలవలేదు. కానీ దాదాపు 7 సీట్లలో ఓట్లు భారీగా చీల్చి టిడిపిని ఓడించి..వైసీపీని గెలిపించింది. ఇక జనసేనకు దాదాపు 20 వేల ఓట్ల వరకు పడిన స్థానాలు..పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ సీట్లు..ఇటు విజయవాడలో ఈస్ట్, సెంట్రల్, వెస్ట్ సీట్లలో ఓట్లు ఎక్కువగానే వచ్చాయి. అటు కైకలూరులో ఓట్లు బాగానే పడ్డాయి.
ఇక వీటిల్లో ఐదు సీట్లు జనసేన అడుగుతున్నట్లు తెలిసింది. కానీ టిడిపికి అన్నీ సీట్లలో బలం ఉంది. పొత్తు లేకుండా గెలిచే సత్తా కూడా ఉన్న సీట్లు కొన్ని ఉన్నాయి. అలాంటప్పుడు టిడిపి సులువుగా సీట్లు వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అయితే విజయవాడ వెస్ట్, కైకలూరు సీట్లు మాత్రం వదులుకునే ఛాన్స్ ఉంది. చూడాలి మరి పొత్తు సెట్ అయితే ఏం జరుగుతుందో.