టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అనే చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఎవరికి వారు పొత్తు గురించి మాట్లాడకుండా..ఎవరు పార్టీని వారు బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారు. కానీ ఎన్నికల ముందు పొత్తు దిశగా వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. పొత్తు ఉంటేనే వైసీపీకి చెక్ పెట్టవచ్చు. లేదంటే ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరగవచ్చు. అది జరగకుండా ఉండటానికి రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్నాయి.
పొత్తులో టిడిపి కొన్ని సీట్లు జనసేనకు వదలాలి. వాస్తవానికి గత ఎన్నికల్లో జనసేన..టిడిపిని దాటిన సీట్లు నాలుగే. రాజోలులో జనసేన గెలవగా, భీమవరం, గాజువాక, నరసాపురం స్థానాల్లో జనసేన రెండోస్థానంలో నిలిచింది. టిడిపికి మూడో స్థానం. అంటే జనసేన కంటే టిడిపికే ఎక్కువ బలం ఉందని చెప్పాల్సిన పని లేదు. కాకపోతే జనసేన కొన్ని సీట్లలో 20 వేలు, 30 వేలు, 40 వేలు ఓట్లు కూడా తెచ్చుకుంది. అలా ఓట్లు తెచ్చుకోవడం వల్ల టిడిపికి నష్టం జరిగింది.

ఇలా జనసేనకు కాస్త ఓట్లు ఎక్కువ పడిన సీట్లని టిడిపి వదులుకునే ఛాన్స్ ఉంది. ఇదే క్రమంలో కాకినాడ రూరల్ సీటు సైతం జనసేనకు ఇస్తున్నారని తెలిసింది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి దాదాపు 74 వేల ఓట్లు పడితే, టిడిపికి 65 వేలు, జనసేనకు 40 వేల ఓట్లు పడ్డాయి. అంటే టిడిపి జనసేన ఓట్లు కలిపితే లక్షా 5 వేల ఓట్లు..అంటే వైసీపీ కంటే 30 వేల ఓట్లు ఎక్కువ.
కాబట్టి రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే కాకినాడ సిటీలో వైసీపీ గెలుపు కష్టమే. అదే సమయంలో ఈ సీటు జనసేనకు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ టిడిపి ఇంచార్జ్‌ని పెట్టలేదు. అంటే జనసేనకు వదిలిపెట్టడానికి ఖాళీగా ఉంచినట్లు ఉంది. మొత్తానికి కాకినాడ రూరల్ జనసేనకే దక్కే ఛాన్స్ ఉంది.