May 31, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

మార్కాపురంలో సైకిల్ రాత మారుతుందా..!

తెలుగుదేశం పార్టీకి పెద్దగా పట్టు లేని నియోజకవర్గాల్లో మార్కాపురం కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఈ స్థానంలో టి‌డి‌పికి పెద్ద బలం లేదు. మొదట నుంచి ఇక్కడ మంచి విజయాలు ఏమి సాధించలేదు. తెలుగుదేశం ఆవిర్భవించిన 1983లో ఒకసారి గెలిస్తే..మళ్ళీ 2009లో గెలిచింది. అసలు రాష్ట్రంలో టి‌డి‌పి హవా ఉన్న 1985, 1994, 1999, 2014 ఎన్నికల్లో మార్కాపురంలో గెలవలేదు.

అంటే ఇక్కడ టి‌డి‌పి పట్టు ఏ మేర ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే 2014 ఎన్నికల్లో కాస్త గట్టిగానే పోరాడింది గాని 9 వేల ఓట్ల మెజారిటీతో టి‌డి‌పి ఓడిపోయిండ్డి. 2019 ఎన్నికల్లో 18 వేల ఓట్ల మెజారిటీతో ఓటమి పాలైంది. అయితే వైసీపీ నుంచి గెలిచిన నాగార్జున రెడ్డి పనితీరు ఏమి బాగోలేదు..ప్రజలకు అందుబాటులో ఉండేది తక్కువ..అలాగే మార్కాపురంలో అక్రమాలు ఎక్కువయ్యాయని సొంత వైసీపీ నేతలే గగ్గోలు పెడుతూ మాట్లాడుతున్నారు. ఈ అంశాలు వైసీపీ ఎమ్మెల్యేకు మైనస్ గా మారాయి. ఇటు టి‌డి‌పి నుంచి కందుల నారాయణ ..రెండు దశాబ్దాల నుంచి పోరాడుతున్నారు. 2004లో పోటీ చేసి ఓడిపోయిన ఈయన..2009 ఎన్నికల్లో గెలిచారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. అయితే వరుసగా ఓడిపోయిన సానుభూతి ఆయనపై ఉంది. అలాగే  ఓడిపోయినా సరే నియోజకవర్గ ప్రజల్లోనే ఉంటున్నారు. దీంతో మార్కాపురంలో కాస్త పార్టీ పికప్ అయింది.

ఇలాంటి సమయంలోనే చంద్రబాబు మార్కాపురంలో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నెల20న మార్కాపురంలో రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొనున్నారు. వీటిని విజయవంతం చేయడానికి టి‌డి‌పి శ్రేణులు రెడీ అయ్యాయి. ఇక బాబు రాకతో మార్కాపురంలో టి‌డి‌పి శ్రేణుల్లో జోష్ పెరిగింది. దీంతో అక్కడ టి‌డి‌పికి మరింత ఊపు వచ్చే ఛాన్స్ ఉంది. అదే ఊపుతో ముందుకెళితే మార్కాపురంలో గెలిచే ఛాన్స్ ఉంది. చూడాలి మరి బాబు రాకతో మార్కాపురంలో సైకిల్ రాత మారుతుందేమో